ఆరు జిల్లాల్లో వేగంగా రికవరీ | Coronavirus: Faster recovery in six districts in AP | Sakshi
Sakshi News home page

ఆరు జిల్లాల్లో వేగంగా రికవరీ

May 5 2020 2:39 AM | Updated on May 5 2020 2:39 AM

Coronavirus: Faster recovery in six districts in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు.  13 జిల్లాలకుగాను 12 జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి చెందితే అందులో ఆరు జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టడమే కాకుండా బాధితులు వేగంగా బయటపడుతున్నారు. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నంలో 50 శాతం మందికి పైగా కోలుకోగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు 50 శాతానికి చేరువలో ఉన్నాయి. 
► ప్రకాశం జిల్లా 81.96 శాతం రికవరీ రేటుతో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మే 4 నాటికి 61 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 50 మంది కోలుకోవడంతో ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం ఈ జిల్లాలో కేవలం 11 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 
► ఆ తర్వాత విశాఖపట్నం 57.14 శాతం, నెల్లూరు 54.94, చిత్తూరు 54.87 శాతం చొప్పున కోలుకున్నారు. 
► పశ్చిమ గోదావరి జిల్లా 49.15, తూర్పుగోదావరి జిల్లా 48.88 శాతం చొప్పున రికవరీ రేటును నమోదు చేశాయి. 
► అత్యధికంగా కేసులు నమోదవుతున్న కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలను పరిశీలిస్తే.. గుంటూరు జిల్లాలో కోలుకుంటున్న వారి పరిస్థితి బాగుంది. ఈ జిల్లాలో రికవరీ రేటు 34.02 శాతంగా ఉంటే కృష్ణాలో 16.54, కర్నూలులో 17.51గా ఉంది.

దేశీయ సగటు కంటే ఏపీలో మెరుగు
కాగా, దేశవ్యాప్త సగటు కంటే ఏపీలో రికవరీ రేటు మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా ఇది 27.52 శాతంగా ఉంటే మన రాష్ట్రంలో 31.75 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మొత్తం 1,650గా ఉంటే.. అందులో ఇప్పటివరకు 524 మంది కోలుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 42,533 మందికిగాను 11,707 మంది కోలుకున్నారు.

36మంది డిశ్చార్జి
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సోమవారం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 36మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 524కు చేరింది. అలాగే, రాష్ట్రంలో కొత్తగా 67 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 1,650కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇందులో కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 491కి చేరింది. గుంటూరు జిల్లాలో 19 కేసులతో మొత్తం కేసులు 338, కృష్ణాలో 12 కేసులతో మొత్తం 278కి చేరింది. కాగా, రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 67.09 శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. మరోవైపు.. ఆదివారం ఉ.9 గంటల నుంచి సోమవారం ఉ.9 గంటల వరకు రికార్డు స్థాయిలో 10,292 మందికి పరీక్షలు నిర్వహించారు. గత పదిరోజులుగా రాష్ట్రంలో కేవలం రెండే రెండు మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఎవరూ మరణించకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 33 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసులు 1,093గా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement