విజయవాడలోనే కరోనా పరీక్షలు

Coronavirus: Covid-19 Virus Tests In Vijayawada - Sakshi

అందుబాటులోకి వచ్చిన వైరాలజీ ల్యాబ్‌

5 జిల్లాల అనుమానితులకు ఇక్కడే పరీక్షలు

6 గంటల్లోనే ఫలితాలు

సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఇకపై విజయవాడలోనే జరగనున్నాయి. దేశంలోను, ప్రపంచవ్యాప్తంగా కరోనా (కోవిడ్‌–19) ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను నిర్ధారించే రియల్‌ టైం పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పరికరం ఏర్పాటుకు రూ.23 లక్షలు కేటాయించారు. దీంతో ఈ ల్యాబ్‌ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఇలాంటి ల్యాబ్‌లు విశాఖపట్నం, తిరుపతిలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి విజయవాడ ల్యాబ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇక్కడకు పంపుతారు. వీటిని పరీక్షించిన అనంతరం వచ్చిన ఫలితాలను నిర్ధారించేందుకు పూణేలోని నేషనల్‌ వైరాలజీ లే»బొరేటరీకి పంపిస్తారు. ఇలా ఇక్కడి ఫలితాలు, పూణే ఫలితాలు సరిగా ఉన్నట్లు తేలితే భవిష్యత్తులో పూణే ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం ఉండదు. 

రెండ్రోజుల్లో ఐదు శాంపిళ్లు
కాగా, శని, ఆదివారాల్లో విజయవాడ ల్యాబ్‌కు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఐదు కరోనా అనుమానిత కేసుల శాంపిళ్లు వచ్చాయి. వీటిని పరీక్షించి, ఆ నివేదికలను పూణేకు పంపించారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిళ్లను తిరుపతికి, అక్కడ నుంచి పూణేకు పంపించాల్సి వచ్చేది. అక్కడ నుంచి రిపోర్టులు రావడానికి మూడు రోజుల సమయం పడుతోంది. కానీ, ఇకపై విజయవాడ ల్యాబ్‌లోనే పరీక్షలు నిర్వహించి ఆరు గంటల్లోనే రిపోర్టు ఇవ్వగలుగుతారు. తద్వారా రోగికి అవసరమైన చికిత్స సత్వరమే అందడానికి వీలవుతుంది. మరోవైపు.. విజయవాడలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌ను కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఆదివారం పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top