రెబల్స్‌పై ఒత్తిళ్లు | Sakshi
Sakshi News home page

రెబల్స్‌పై ఒత్తిళ్లు

Published Wed, Jan 29 2014 1:25 AM

Congress Party Rebel nomination papers Caitanya raju

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్‌గా జిల్లా నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. పార్టీ నాయకత్వం నిర్ణయంతో ప్రమేయం లేకుండా సమైక్యాంధ్ర నినాదంతో చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలో దిగుతారని అంతా భావించారు. పలు దఫాలు సీమాంధ్ర నేతల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం చివరకు జిల్లా నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు, నెల్లూరు జిల్లా నుంచి ఆదాల  మాత్రమే నిలిచారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌గా చైతన్యరాజు, జేసీ దివాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి బరిలోకి దిగాలనుకున్నారు. గడచిన రెండు రోజులుగా జరిగిన చర్చల పరంపర కొలిక్కి వచ్చి చైతన్యరాజు, ఆదాల నామినేషన్‌లు దాఖలు చేశారు. అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిళ్లు లేదా, సీమాంధ్ర నేతల మధ్య కుదిరిన అవగాహన కావొచ్చు జేసీ దివాకరరెడ్డి నామినేషన్ దాఖలు చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. మిగిలిన ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు.
 
 దీనిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం రెబల్స్ ఇద్దరిని బరి నుంచి తప్పించేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు చేస్తోంది. చైతన్యరాజు, ఆదాల నామినేషన్‌లు దాఖలు చేసిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు ఒకరి తరువాత మరొకరు వెంటపడుతూ నామినేషన్‌లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి పెంచుతున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు గురువారం. ఈలోగా రెబల్స్‌ను బరి నుంచి తప్పుకునేలా ఒప్పించగలుగుతామనే ధీమాతో పార్టీ రాష్ట్ర నేతలున్నట్టుగా కన్పిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ పెద్దలు చైతన్యరాజుపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకురాగా, ఆరునూరైనా తాను రాజ్యసభ బరి నుంచి వెనక్కు తగ్గేది లేదని చెప్పారని హైదరాబాద్‌లో ఉన్న అనుచరుల ద్వారా తెలియవచ్చింది.
 
 నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం చేసిన ఇద్దరు శాసనసభ్యులు పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వెనక్కు తగ్గినట్టు సమాచారం. ఆదాలకు మద్ధతు తెలియచేస్తూ ఇచ్చిన లేఖలను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కు తీసేసుకున్నారని తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం అనివార్యమేనంటున్నారు.గడచిన వారం రోజులుగా చర్చలు, సంప్రదింపుల నేపథ్యంలో చైతన్యరాజుకు మద్ధతుగా 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారితోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ఇస్తారనే ధీమా చైతన్యరాజు వర్గీయుల నుంచి వ్యక్తమవుతోంది. అధిష్టానం ఒత్తిళ్లు ఫలితాన్నిస్తాయో, బరి నుంచి తప్పుకునేది లేదని తెగేసి చెబుతోన్న చైతన్యరాజు మాట చెల్లుబాటు అవుతుందో చూడాలి.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement