
మార్చి 31 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలగకుండా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకుగాను ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు నాలుగు నెలలపాటు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. అయితే దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం నడకదారికి అనుమతించాలని సూచించారు. రహదారి మూసివేసినన్ని రోజులూ పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతివ్వవద్దని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని కోరారు.