కాలుష్య కష్టాలకు చెక్‌!

Coal Storage in Visakhapatnam port - Sakshi

రూ.500 కోట్లతో బొగ్గు నిల్వల గోదాములు

ప్రణాళికలు సిద్ధం చేసిన విశాఖ పోర్టు ట్రస్టు

ఏటా రూ.100 కోట్లతో కాలుష్య నివారణ

సహకారం అందించనున్న కేంద్రం

విశాఖలో పోర్టు కాలుష్యం తగ్గినప్పటికీ.. బొగ్గు నిల్వల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోర్టు నుంచి సుమారు 3 చదరపు కిలోమీటర్ల వరకూ బొగ్గుకి సంబంధించిన నల్లటి రేణువులు విస్తరించి నగరం కలుషితమవుతోంది. దీన్నిఅధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ఐదేళ్ల ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏటా రూ.100 కోట్లు చొప్పున రూ.500 కోట్లతో బొగ్గు నిల్వల కోసం గోదాములు నిర్మించాలని వీపీటీ భావిస్తోంది.

సాక్షి, విశాఖపట్నం:  సుందర విశాఖ నగరంలో కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. ఇంటి కాలుష్యం ఓవైపు ఇబ్బంది పెడుతుంటే.. పోర్టు కాలుష్యం మరోవైపు వ్యాధుల బారిన పడేస్తోంది. పోర్టు నుండి బొగ్గు ఎగిరి రావటంతో దుస్తులు వేసుకున్న కొద్ది సేపటికే వాటిపై బొగ్గు పేరుకుపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో రోజుకి నాలుగుసార్లు తడిగుడ్డలు పెట్టినా క్షణాల్లో బొగ్గుపడి పేరుకుంటోంది. నగరంలో 40 శాతానికి పైగా ప్రాంతాలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ధూళికణాల వల్ల ప్రధానంగా శ్వాసకోస వ్యాధులు ప్రబలుతున్నాయి. పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. బొగ్గుకి సంబంధించిన ధూళి కణాలు ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్నాయి. 2002లో పోర్టు ధూళి కాలుష్యంపై విశాఖపట్నం పోర్టు ట్రస్టు చర్యలు ప్రారంభించింది. 4,75,000 చదరపు మీటర్ల పరిధిలో రూ.8 కోట్లతో మెకానికల్‌ డస్ట్‌ సప్రెషన్‌ సిస్టమ్‌ని ప్రారంభించారు. ఆర్‌–4, ఆర్‌–10 కోల్‌ కార్గో ప్రాంతాల్లో 24 గంటలూ వాటర్‌ ట్యాంకర్లతో స్ప్రింక్లర్లతో స్ప్రే చేస్తున్నారు. మొత్తం 275 ట్రిప్పుల ద్వారా 4 ఎంఎల్‌డీ సివరేజ్‌ ట్రీటెడ్‌ నీటిని ఈ ప్రక్రియకు వినియోగిస్తున్నారు. దీనికి తోడుగా... 4 మీటర్ల డస్ట్‌ బ్యారియర్‌తో కలిపి మొత్తం 11.5 మీటర్ల ఎల్తైన రక్షణ గోడని నిర్మించారు. అయితే.. బొగ్గు కణాల వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. లోడింగ్, అన్‌లోడింగ్‌ చేసే సమయంలో ఈ కణాలు ఎగిరి నగరంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది.

కాలుష్య కారకాల్ని మరింత తగ్గించే దిశగా....
పూర్తిస్థాయిలో బొగ్గు కాలుష్యాన్ని నివారించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో పోర్టు పరిసర ప్రాంతాల్లో పీఎం 10 లెవెల్స్‌ లీటరుకు 100 ఎంజీ ఉండేది. వీపీటీ తీసుకున్న నివారణ చర్యలతో ఇది ప్రస్తుతం 60 ఎంజీ కంటే తక్కువ నమోదవుతోంది. దీన్ని మరింత తగ్గించేందుకు పోర్టు ముందుకొచ్చింది. నగర ప్రజలు పోర్టు కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన విశాఖ పోర్టు ట్రస్టు 86వ వార్షికోత్సవంలో అధికారులు వెల డించారు.

2018–19లో 25 శాతం బొగ్గు కార్గో...
విశాఖ స్టీల్‌ ప్లాంట్, ఇతర సంస్థలకు అవసరమైన థర్మల్, కోకింగ్‌ కోల్‌ని విశాఖ పోర్టు ట్రస్టు నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టీమ్‌ కోల్‌ నిల్వలు కూడా పోర్టులో ఉంటాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1.85 మిలియన్‌ టన్నులు థర్మల్‌ బొగ్గు, 5.80 మిలియన్‌ టన్నుల కోకింగ్, 8.95 మిలియన్‌ టన్నుల స్టీమ్‌ కోల్‌ నిర్వహణ కార్యక్రమాల్ని పోర్టు నిర్వహించింది. ఇది పోర్టు కార్గో రవాణాలో 25.42 శాతంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు కార్గో కార్యకలపాలు జరుగుతున్న నేపథ్యంలో దీని కాలుష్య నివారణపై పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది.

ఏటా రూ.100 కోట్లతో....
ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్స్‌లో భాగంగా సమగ్ర కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పోర్టు ట్రస్టు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా రూ.100 కోట్లతో ఐదేళ్ల ప్రణాళిక రూపొందించింది. మొత్తం రూ.500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో గోదాములు నిర్మించనుంది. పోర్టు పరిసరాల్లోనే కోల్‌ కవర్డ్‌ స్టోరేజ్‌ షెడ్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే టార్పాలిన్లు కప్పుతూ లారీల ద్వారా లోడ్స్‌ తీసుకొస్తున్నారు. ఆ లారీలు నేరుగా షెడ్లలోకి వెళ్లి లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తాయి. దీనివల్ల.. ఆ సమయంలో ఎగిరే బొగ్గు కణాలన్నీ.. షెడ్‌లలోనే ఉండిపోతాయి. బయటకు ఎగరకుండా ఉంటాయి. దీని వల్ల నగరంలోకి ఎగిరే బొగ్గు రేణువుల శాతం గణనీయంగా తగ్గుతుంది. దీనికి సంబంధించి డిజైన్లను ఏయూ ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు రూపొందించారని విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌ తెలిపారు. ఈ నెలాఖరు కల్లా టెండర్లను ఆహ్వానించనున్నామని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top