ఎవరు సొంత ప్రాంతాలకు రావొద్దు!

CMO Additional Chief Secretary PV Ramesh Chit Chat With Sakshi On Corona

సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏపీ వారికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఎవరూ సొంత ప్రాంతాలకు రావాలని ప్రయత్నించవద్దు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ లను ఈ వ్యవహారాల కోసం సీఎం నియమించారు. దయచేసి ఎవరు సొంత ప్రాంతాలకు రావద్దని సీఎం ప్రత్యేకంగా కోరారు’ అని ఆయన తెలిపారు. 

ఇది చదవండి: ( చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి)

ఇప్పటి వరకు భారతదేశంలో 873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ పీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.  శనివారం రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆయన వెల్లడించారు. ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్ని నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top