ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Delhi Tour | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Aug 6 2019 8:56 AM | Updated on Aug 6 2019 2:10 PM

CM YS Jagan Mohan Reddy Delhi Tour - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయనను కోరనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలకు చెందిన పెండింగ్‌ నిధుల మంజూరుతోపాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్‌గ్రిడ్‌ అమలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు తగిన నిధులు మంజూరు చేయాలని విన్నవించనున్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కుల గణనలో పొరపాట్లు జరిగాయని ఆయన దృష్టికి తెస్తారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం నుంచి గృహాల మంజూరు సంఖ్య తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో మళ్లీ గణన చేయడం ద్వారా గృహాల మంజూరులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరనున్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే ఇప్పించడంతోపాటు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు ఆర్థిక వనరులను సమకూర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌ విన్నవించనున్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఏ ఏడాదిలో ఎన్ని నిధులు అవసరం, ఏయే పనులు ఎప్పుడు పూర్తి చేయనున్నాం)ను ప్రధానికి సమర్పించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడంతోపాటు ప్రజాధనాన్ని ఆదా చేయడానికి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని, దీని కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరగదని వివరించనున్నారు. ప్రాజెక్టు పనులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కూడా ప్రధానికి తెలియజేస్తారు.  

ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సమీక్ష కూడా ప్రజాధనం ఆదా చేయడం ద్వారా డిస్కమ్‌లపై ఆర్థిక భారం తగ్గించేందుకేనని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానికి వివరించనున్నారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు తరలించడం ద్వారా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం సహా వెనుకపడ్డ తొమ్మిది జిల్లాల రైతులకు సాగునీరు అందించవచ్చునని, అందుకే ఈ ఆలోచన చేస్తున్నామని, దీనికి కూడా ఆర్థిక సాయం చేయాలని విన్నవిస్తారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 

బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతితో, 11.30 గంటలకు ఉపరాష్ట్రపతితో ఆయన సమావేశమవుతారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారు. తర్వాత సీఎం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement