కొత్త కార్డులకు డిసెంబరు కోటా | Sakshi
Sakshi News home page

కొత్త కార్డులకు డిసెంబరు కోటా

Published Sat, Dec 14 2013 5:16 AM

civil supplies new card holders get from december

సాక్షి, గుంటూరు : వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ లో ప్రజలకిచ్చిన వరాలపై దృష్టి సారిస్తోంది. కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులకు డిసెంబరు నెల కోటాను విడుదల చేసి పేదల ఓట్ల కోసం గాలం విసిరింది. రచ్చబండ-3 కింద ప్రజలకు పంపిణీ చేసిన 70,159 రేషన్ కార్డులకు డిసెంబరు నెల కోటా కింద 620 మెట్రిక్ టన్నుల కిలో రూపాయి బియ్యాన్ని విడుదల చేసింది. రచ్చబండ సభల్లో రేషన్‌కార్డులు, కూపన్లు పంపిణీ చేసిన వారందరికీ డిసెంబరు నెల సరుకుల్ని 25 లోగా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో మొత్తం 10,98,964 తెల్లకార్డులు, 82264 అంత్యోదయ అన్నయోజన, 1401 అన్నపూర్ణ కార్డులున్నాయి. రచ్చబండ -3 కార్యక్రమం ముగిసే నాటికి కొత్తగా పంపిణీ చేసిన 70,159 కార్డులతో కలిపి వీటి సంఖ్య 14,34, 993 అయ్యాయి. వీటన్నింటికీ డిసెంబరు నెల కోటా కింద 19,704 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. డీలర్లు వెంటనే మండల లెవల్ స్టాక్‌పాయింట్ల నుంచి సరుకును తీసుకెళ్లి కార్డుదారులకు పంపిణీ చేయాలని డీఎస్‌వో రవితేజనాయక్ పేర్కొన్నారు.
 ఆధార్‌కార్డుల లింకు 71 శాతం పూర్తి..
 జిల్లాలో 11,53,451 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 8,19,078 మంది(71శాతం) ఆధార్‌కార్డుల్ని గ్యాస్ ఏజెన్సీల్లో లింకు చేయించుకున్నారు.  కాగా బ్యాంకుల్లో మాత్రం 5,00,687 మంది(44శాతం) మాత్రమే పేర్లను నమోదు చేయించుకున్నారు. జిల్లాలో ఉన్న 48,89,230 మంది జనాభాలో 48,46,100 మంది ఆధార్ గుర్తింపు కార్డుల కోసం పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇంకా 43,130 మంది ఆధార్ కార్డుల కోసం పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ మంది (99.12 శాతం) పేర్లను నమోదు చేయించుకున్న జిల్లాగా గుంటూరు నిలిచింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement