ఇన్ని ఫిర్యాదులా.. పద్ధతి మార్చుకోండి | Civil Supplies Corruption Department in Kakinada | Sakshi
Sakshi News home page

ఇన్ని ఫిర్యాదులా.. పద్ధతి మార్చుకోండి

Sep 14 2014 1:16 AM | Updated on Sep 22 2018 8:22 PM

ఇన్ని ఫిర్యాదులా.. పద్ధతి మార్చుకోండి - Sakshi

ఇన్ని ఫిర్యాదులా.. పద్ధతి మార్చుకోండి

సివిల్ సప్లైస్ (పౌరసరఫరాలు) శాఖ అంటే అవినీతి శాఖ అన్నట్టు మార్చేశారు. ఈ ముద్ర నుంచి బయట పడేయాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా

 సాక్షి, కాకినాడ :‘సివిల్ సప్లైస్ (పౌరసరఫరాలు) శాఖ అంటే అవినీతి శాఖ అన్నట్టు మార్చేశారు. ఈ ముద్ర నుంచి బయట పడేయాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా ఈ శాఖను మహిళనైన తనకు ఇచ్చారని ఆ శాఖమంత్రి పరిటాల సునీత అన్నారు. రేషన్‌షాపుల నిర్వహణ, గ్యాస్ సిలిండర్ల కొరత, లెవీ సేకరణ వంటి వాటికి సంబంధించిన ఇబ్బందుల విషయంలో అధికారుల తీరుపై  శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన మంత్రి సునీత ‘మీపై ఇన్ని విమర్శలా..ఇలా అయితే ఎలా?’ అంటూ మండిపడ్డారు. ‘మీ పద్ధతి మార్చుకోండి. పనితీరు మెరుగుపర్చుకోండి’ అంటూ హితవు పలి కారు. శాఖపై అవినీతి ముద్ర తొలగించేందుకు కృషి చేస్తానని..అందుకు అధికారులు సహకరించాలని కోరారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు సిద్ధం కావాలని ఆదేశించారు.
 
 జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, బుక్ చేసిన నెలరోజులకు కానీ రావడం లేదని పలువురు ఎమ్మెల్యేలతో పాటు విలేకరులు కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హెచ్‌పీసీఎల్ కో ఆర్డినేటర్ వివరణ ఇస్తూ గెయిల్ పైపులైన్ పేలుడుతో పైపులైన్లను తనిఖీ చేస్తున్నందునే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పబోయారు. అయితే ఆ పైపులైన్‌కు..ఈ పైపులైన్‌కు సంబంధమేమిటని పలువురు ప్రశ్నించారు. వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్ది బుక్ చేసిన వారంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేలా చూడాలని జేసీ ముత్యాలరాజును మంత్రి ఆదేశించారు. రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్ విధానం అమలు తీరును పరిశీలించిన మంత్రి ఈ విధానంలో ఇచ్చే రశీదులన్నీ తెలుగులో ఉండేలా చూడాలన్నారు. త్వరలోనే జిల్లాలో అన్ని రేషన్‌షాపుల్లో ఈ-పాస్ ప్రక్రియ అమలుకుఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
 
 మద్దతుధర ముందే ప్రకటిస్తే మేలు : చినరాజప్ప
 ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధాన్యం మార్కెట్‌కు వచ్చేలోపే మద్దతు ధర, సేకరణ విధానం ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.  కేంద్రం ప్రకటించిన కొత్త లెవీ పాలసీ వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లెవీ సేకరణను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపడతామని మంత్రి సునీత హామీ ఇచ్చారు.   
 
 రైతుబ జార్, రేషన్‌షాపుల పరిశీలన
 అనంతరం మంత్రి సునీత ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న రైతుబజార్‌ను పరిశీలించారు. ఎస్టేట్ ఆఫీస్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. స్టాళ్లను సందర్శించి రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొడారిగుంటలో రేషన్ షాపు నం: 87ను సందర్శించి ఈ-పాస్ విధానంలో ప్రజా పంపిణీ అమలును పరిశీలించారు.   కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో రూ.5 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని సునీత ప్రారంభించారు. పెనుగుదురులోని శ్రీ వెంకటేశ్వరా రైస్ మిల్లును సందర్శించి రికార్డులను తనిఖీచేశారు. జిల్లాలో ప్రతి సీజన్‌లో మిల్లర్లు రైతుల నుంచి మద్దతుధరకంటే రూ.100 నుంచి రూ.500 వరకూ అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు జిల్లా రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఎ.రామకృష్ణారెడ్డి మంత్రికి వివరించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే రైతులకు మరింత ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి కొండబా బు, పిల్లి అనంతలక్ష్మి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీఎస్‌ఓ రవికిరణ్, సివిల్ సప్లయిస్ డీఏం టీవీఎస్‌జీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement