సీఐడీ అదుపులో ‘మెడికల్’ స్కామ్ సూత్రధారి? | CID Control 'Medical' behind the scam? | Sakshi
Sakshi News home page

సీఐడీ అదుపులో ‘మెడికల్’ స్కామ్ సూత్రధారి?

Apr 27 2014 3:38 AM | Updated on Aug 11 2018 8:21 PM

రాష్ట్రంలో సంచలనం రేపిన వైద్యవిద్య పీజీ ప్రవేశపరీక్ష కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్‌గోపాల్‌రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన వైద్యవిద్య పీజీ ప్రవేశపరీక్ష కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్‌గోపాల్‌రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతనెల మార్చిలో నిర్వహించిన ఈ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం లీక్ కేసులో సీఐడీ ఇప్పటివరకు 41 మంది నిందితులను అరెస్టు చేసింది. ఇందులో సగం మంది దళారులు కాగా మిగతావారు విద్యార్థులు. బెంగళూరులోని మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన ఈ స్కామ్‌కు బెంగళూరుకు చెందిన రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని సీఐడీ నిర్ధారించింది.

రాజ్‌గోపాల్‌రెడ్డి తన శిష్యుడు అమీర్ అహ్మద్ ద్వారా మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పీజీ మెట్ ప్రశ్నపత్రాన్ని తస్కరింపజేశాడని, బ్రోకర్ల ద్వారా విద్యార్థులను సమీకరించి ఒక్కో పత్రాన్ని లక్షల రూపాయల చొప్పున విక్రయించినట్లు సీఐడీ దర్యాప్తులో  తేలింది. అమీర్‌తో పాటు మణిపాల్ ప్రెస్‌నుంచి ప్రశ్నపత్రాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ప్రవీణ్‌లను విచారించడంతో రాజ్‌గోపాల్ పాత్ర వెలుగుచూసింది. కాగా, రాజ్‌గోపాల్‌రెడ్డి గతంలోనూ మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు, ఎంట్రెన్స్ పత్రాలను లీక్ చేసి లక్షల రూపాయలకు విక్రయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement