నడత చెడుతున్న నాలుగో సింహం..!

CI Harassments on Women Constable in Chittoor - Sakshi

స్టేషన్‌కు వచ్చే మహిళలకు వల

జిల్లాలో ఎక్కువవుతున్న కేసులు

బాధితుల్లో మహిళా పోలీసులూ ఉన్నారు

పరువు కోసం పెదవి విప్పని పరిస్థితి

కుటుంబంలో నెలకొన్న కలహాలు తీర్చాలంటూ పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కిన మరో వివాహితకు న్యాయం చేస్తామని నమ్మబలికిన సీఐ.. తన కోరికను తీర్చాలంటూ పట్టుబట్టాడు.  తిరుమలను వేదికగా చేసుకోవడం, బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయన్ని మీడియా వేదికగా బయటపెట్టడం ఇటీవల వెలుగుచూసింది. దీంతో ఆ సీఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు.

చిత్తూరు అర్బన్‌: న్యాయం చేయాల్సిన పోలీసులే నడత తప్పుతున్న వైనాలు జిల్లాలో కలరవరపరుస్తున్నాయి. ఇటీవల ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చేవారి పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, ఖాకీల పరువు నిలబెట్టాలని అధికారులు ఓవైపు ఊదరగొడుతుంటే..  కొందరు పోలీసు అధికారులు అనుచిత ప్రవర్తనతో వృత్తికే కళంకం తెచ్చిపెడుతున్నారు. సాధారణంగా ఎక్కడా సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతారు. అన్ని దార్లు మూసుకున్న వేళ ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందేమో అనే చిన్న ఆశతో వచ్చే మహిళల పట్ల కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నతీరు దారుణంగా ఉంటోంది. భర్తతో ఏర్పడ్డ గొడవను సర్దుబాటు చేయాలని, విడిపోతున్న కాపురాన్ని నిలబెట్టాలని, అత్తమామలు పెట్టే నరకంనుంచి బయటపడేయాలని, భర్త ఆపదలో ఉన్నాడని ధైర్యం చేసి స్టేషన్‌కు వస్తున్న మహిళల సమస్యను బలహీనతగా మార్చేసుకుంటున్న కొందరు అధికారులు మహిళల ఫోన్‌ నంబర్లు తీసుకుని విచారణ పేరిట వేధిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

బజారున పరువు..
కొందరు పోలీసు అధికారుల వల్ల శాఖపై మచ్చ పడుతోందని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. బాధిత మహిళలు నోరుమెదపడానికి భయపడుతున్నారు. మరోవైపు కుటుంబం పరువు బజారునపడితే ఇబ్బంది అని ఎవ్వరితోనూ ఈ విషయాలు పంచుకోవడం లేదు. బాధిత మహిళకు బాసటగా, తప్పుచేసిన వారిపై కొందరు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అవి తాత్కాలికంగాను ఉన్నాయి. మరికొందరు అధికారులకు ఆ ఖాకీలు అన్నీ తామై వ్యవహరిస్తుండటం వల్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.

మరికొన్ని ఘటనలు...
చిత్తూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ మహిళా పోలీసు అధికారి ప్రవర్తనపై ముగ్గురు పోలీసులు ఎస్పీకే లేఖ రాశారు. ఇది ఎవరని తెలిసినా, స్టేషన్‌లో కేసు నమోదైనా ఆ పోలీసులపై ఇప్పటి వరకు చర్యల్లేవు.
2016లో కుప్పం పోలీస్‌ స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి వేధింపులు తాళలేక అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి రోడ్డున పడ్డారు. సదరు అధికారిపై చర్యలు లేకపోగా.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు స్థానచలనం తప్పలేదు.
జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మరో అధికారి నమ్మించి గర్భవతి చేశాడని మూడేళ్ల క్రితం ఓ యువతి మీడియాను ఆశ్రయించడం సంచలనంగా నిలిచింది.

అలాంటి వారిని ఉపేక్షించను..
చట్టం అందరికీ సమానమే. అది ప్రజలైనా.. పోలీసులైనా. మా శాఖలో ఎవరైనా ఇలాంటి వేధింపులకు పాల్పడ్డా, వేధింపులకు గురైనా నన్ను నేరుగా కలిసైనా ఫిర్యాదు చెయ్యొచ్చు. ఫోన్‌ ద్వారా అయినా సమస్య చెప్పొచ్చు. చెబితే ఏమనుకుంటారోనని భయపడొద్దు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదు.– విక్రాంత్‌ పాటిల్, చిత్తూరు ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top