చింతమనేని అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలు

Chintamaneni Followers Illegal Sand Mining In Denduluru - Sakshi

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేత అబ్బయ్య చౌదరి

పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయింపు

 యంత్రాన్ని సీజ్‌ చేసిన అధికారులు  

పెదవేగి రూరల్‌  : ఒకపక్క ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర 200 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా బుధవారం పెదవేగి మండలంలో పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరికి ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అబ్బయ్య చౌదరి కార్యకర్తలతో కలిసి వెళ్లి తమ్మిలేరులో అక్రమంగా ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయించారు.

జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఆర్‌డీఓ, తహసీల్దార్‌లకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. మీరు వస్తే కాని ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పి అక్కడే భైఠాయించారు. దీంతో పెదవేగి తహసీల్దార్‌ ఎండి నజిముల్లాషా, ఎస్సై కాంతిప్రియ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ  సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌ పొక్లయిన్‌తో తవ్వకాలు చేసి, యంత్రంతో ఇసుకను జల్లించి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తమ్మిలేరు పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వచ్చి ఇసుక గోతులను పరిశీలిస్తే ఎంత మేర దోచుకున్నారో అర్థం అవుతుందన్నారు. ఈ తవ్వకాలపై నడిపల్లి, ఎల్లాపురం సమీప ప్రాంత రైతులు హైకోర్టుకు వెళ్లి తమ్మిలేరులో ఇసుక తీయకుండా ఆర్డర్‌ తీసుకువస్తే తాత్కాలికంగా పది రోజులు నిలిపి మళ్లీ ఎమ్మెల్యే అండదండలతో తవ్వుతున్నారన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాంతో అధికారులు పొక్లయిన్‌ను సీజ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top