సర్వజనాస్పత్రిలో పసికందుల మృతి

Child Deaths in Sarvajana Hospital Anantapur - Sakshi

వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ

ఆదివారం రాత్రి ఆస్పత్రిలో టెన్షన్‌

భయాందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు

ఇక్కడ వైద్యం వద్దంటూ శిశువులను తీసుకువెళ్లిన వైనం

అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఆదివారం ఇద్దరు పసికందుల మృతి తీవ్ర వివాదానికి దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబీకులు ఎస్‌ఎన్‌సీయూ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటకి చెందిన లక్ష్మిదేవి, ఎర్రిస్వామిల పాప(1.3 కేజీలు), కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ, గంగయ్య పాప(2కేజీలు) ప్రీమెచ్యుర్‌డ్‌ బేబీలు. వీరిని ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఔట్‌బార్న్‌ యూనిట్‌లో చేర్పించారు. వీరు సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న పిల్లలను ఇస్తే, వారి ప్రాణం లేకుండా ఇచ్చారని కన్నీరుపెట్టారు. యూనిట్‌లో ఏసీలు పనిచేయడం లేదని, ఉదయం నుంచి ఐదు మంది చనిపోయారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  చివరకు ఔట్‌పోస్టు ఏఎస్‌ఐ రాము తదితరులు బాధిత కుటుంబీకులను నచ్చజెప్పడంతో సమస్య సద్దుముణిగింది. 

వద్దు బాబోయ్‌  
ఎస్‌ఎన్‌సీయూలో ఇద్దరు చిన్నారులతో మృతి కలకలం రేగడంతో అక్కడే ఉన్న రెండు కుటుంబాలు తమ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు చెబుతున్నా..హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్తామంటూ వెళ్లిపోయారు. చివరకు వైద్యులు వారితో సంతకాలు చేయించుకుని డిశ్చార్జ్‌ చేశారు.  

మెరుగైన సేవలందించాం  
ఇద్దరు పసికందుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. రెండు ప్రీమెచ్యూర్డ్‌ బేబీలు. పుట్టగానే ఏడవలేదు. దీంతో వారు కోలుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ రౌండ్‌ ద క్లాక్‌ మెరుగైన సేవలందించాం. అమాయక ప్రజలకు తెలియక మాపై ఆరోపణలు చేస్తున్నారు.  – డాక్టర్‌ శ్రీధర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top