అబద్ధాలు అదరహో | Chandrabau Naidu BC Meeting in East Godavari | Sakshi
Sakshi News home page

అబద్ధాలు అదరహో

Jan 28 2019 7:58 AM | Updated on Jan 28 2019 7:58 AM

Chandrabau Naidu BC Meeting in East Godavari - Sakshi

రాజమహేంద్రవరంలో ‘జయహో బీసీ’ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

వింటున్న జనాలు ఏమనుకుంటారో...చెప్పేవి నమ్మశక్యంగా ఉన్నాయో లేవో.... కురిపించిన హామీలను నమ్ముతారో లేదో... ఇవేవీ సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకున్నట్టు లేదు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా నోటికొచ్చిన హామీలు మళ్లీ మళ్లీ ఇచ్చేశారు. జయహో బీసీ పేరుతో మరోసారి వెనుకబడిన వర్గాలను మోసగించేందుకు తయారయ్యారు. నాలుగున్నరేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పుడు బీసీల సమస్యలేవీ గుర్తుకు రాలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా వారి బాధలన్నీ గుర్తుకొచ్చేశాయి. వారిపై వల్లమాలిన ప్రేమను ఒలకబోశారు. అబద్ధాలను వల్లించారు.  నోటికొచ్చిన హామీలను ఇచ్చేసి రాజమహేంద్రవరం వేదికగా మభ్య పెట్టే ప్రయత్నం చేశారు.

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : రాజమహేంద్రవరం వేదికగా ఆదివారం జరిగిన ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు ఆద్యంతం తనకు తాను భజన చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకని ఉదయం నుంచి జిల్లా నలుమూలలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ చేశారు. 3లక్షల మంది బీసీలతో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ వేలల్లో రెండు పదులు కూడా దాటలేదు. వీరిలో కూడా అన్నీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇక, సీఎం 4.36 గంటలకొచ్చాక ఆ జనం కూడా తిరుగుముఖం పట్టారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభించాక చాలా కుర్చీలు ఖాళీ అయిపోయాయి. చివరికొచ్చేసరికి ప్రాంగణం వెలవెలబోయింది. చంద్రబాబు ఈ సారి కూడా అవే మోసాలకు దిగారు. గత ఎన్నికల ముందు ఏరకమైన హామీలైతే ఇచ్చారో ఇప్పుడవే హామీలు మరోసారి ఇచ్చి బీసీలను బహిరంగంగా మోసగించారు. 2014 ఎన్నికల ముందు ఇదే రకంగా అనేక హామీలిచ్చారు.

మేనిఫెస్టోలో 110కి పైగా హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, ఇతర వర్గాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చుతామన్నారు. గాండ్ల, నగర, పూసల, కురచి, బోయ, పద్మశాలి తదితర కులాను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చుతామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. ఇంతవరకు వాటిని అమలు చేయలేదు సరికదా హామీలు గుర్తు చేసిన నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు వారందరికీ అండగా ఉంటానని, వారడుగుతున్నట్టు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీలిచ్చేశారు. బీసీల్లో ఉన్న మెజార్టీ కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. జనాలు నవ్వుకుంటారని కూడా చూడకుండా ఒకదాని తర్వాత ఒకటి చదివేశారు.  చెప్పాలంటే సభలో ఉన్న వారంతా ‘ఇదేంటి నోటికొచ్చినట్టు హామీలిచ్చేస్తున్నారని...గతం గుర్తుకు రాలేదా’ అని విస్తుపోయారు. చెప్పాలంటే అబద్ధాలనే చెప్పుకొచ్చారు. తాను నాలుగున్నరేళ్లుగా రూ.40వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు ప్రసంగమిచ్చారు. వైఎస్సార్‌ పాలనతో పోల్చుతూ స్క్రిప్ట్‌ చదివారు. చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే. వైఎస్సార్‌ హయాంలో బీసీలకు కేటాయించిన నిధులను తక్కువగా చూపించి, తన హయాంలో ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అబద్ధాలు వల్లించారు.

నాలుగున్నరేళ్లు గుర్తుకురాని బీసీల సమస్యలు
అధికారంలో నాలుగున్నరేళ్లకు పైగా ఉన్నారు. ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుతున్నారు. కానీ బీసీల ఇబ్బందులు గుర్తుకు రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ వారికి సమస్యలు ఉన్నాయని చెప్పి...అండగా నిలుస్తానని నమ్మబలికి అనేక హామీలిచ్చారు. కొత్తగా 69 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పెడతానని, నియోజకవర్గానికొక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తానని, అత్యంత వెనకబడిన బీసీలకు రూ. 30వేల నుంచి రూ. 50వేలకు సబ్సిడీ పెంచుతానని, అత్యంత వెనకబడిన వర్గాలకు 100యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తానని, నాయీ బ్రాహ్మణుల షాపులకు 150యూనిట్లు, స్వర్ణకారులకు 100యూనిట్లు ,చేనేత కార్మికులకు 100నుంచి 150యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తానని హామీలిచ్చారు. విదేశీ  విద్య కోసం వెనకబడిన వర్గాల విద్యార్థులకు రూ. 15లక్షలు సాయం చేస్తానని, గొర్రెలకు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రీమియం చెల్లిస్తానని...ఇలా రకరకాలుగా మోసపూరిత హామీలిచ్చారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉండగా ఏమీ చేయని వ్యక్తి ఎన్నికలు సమీపిస్తున్న వేళ హామీలిచ్చారంటే ఏమనాలని ఆ పార్టీ అభిమానులే పెదవి విరిచారు. ఇక, బీసీల సబ్‌ ప్లాన్‌ అంశాన్ని మరోసారి హామీ అస్త్రంగా చేసుకున్నారు. సబ్‌ ప్లాన్‌తో చాలావరకు చేసేశానని చెబుతూనే మరోవైపు సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొచ్చి అమలు చేస్తానంటూ మరోసారి బీసీలను మోసగించేందుకు యత్నించారు.

జగన్‌ పాదయాత్ర హామీలు కాపీ
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడమే కాకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా చాలావరకు కాపీ కొడుతూ జయహో బీసీ సభలో వరాలు జల్లు కురిపించారు. వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించగా వాటినే ఇక్కడ చంద్రబాబు చాలా వరకు ప్రకటించారు.

బీసీ సంఘాలకు చోటేది?
జయహో బీసీ సభను ఆ పార్టీకి చెందిన నాయకులతోనే మమ అన్పించేశారు. సాధారణంగా తటస్థులైన బీసీ సంఘాలను ఆహ్వానించి, వారి అభిప్రాయాన్ని తీసుకుని, వారికేం కావాలో తెలుసుకుని, ఆ మేరకు ప్రకటనలు చేయాలి. కానీ, ఇక్కడ తమ పార్టీ నేతలే ముందు మాట్లాడారు. తటస్థులైన బీసీ సంఘాలకు ఆహ్వానమే లేదు. వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించలేదు. చెప్పాలంటే దీన్ని జయహో బీసీ సభ అనేదాని కన్న సాధారణంగా జరిగే టీడీపీ బహిరంగ సభ అని అంటే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement