మరో ‘రత్నం’ దోచేందుకు రంగం సిద్ధం

Chandrababu coping the Few Schemes of YSRCP Navaratnalu  - Sakshi

రైతు భరోసాను కాపీ కొట్టి.. రైతు రక్ష పథకం పేరుతో ప్రకటించేందుకు కసరత్తు

విధివిధానాలు సిద్ధం చేసి త్వరలో ప్రకటించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని కూడా కాపీ కొట్టేందుకు సమాయత్తం 

ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు ఐదు, ఇతర కులాలకు ఐదు శాతం 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన పెన్షన్ల పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు తాజాగా వైఎస్సార్‌ రైతు భరోసాను సైతం కాపీ కొట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. విధివిధానాలు రూపొందించి త్వరలో దీన్ని ప్రకటించనున్నారు. ఈ పథకానికి రైతు రక్ష అని పేరు పెట్టాలని భావిస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఇప్పుడున్న వెయ్యి రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించగా దాన్ని చంద్రబాబు కాపీ కొట్టి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరో పథకం వైఎస్సార్‌ రైతు భరోసాను కూడా కాపీ కొట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకం కింద రూ.50 వేలను నాలుగు విడతలుగా నాలుగేళ్లలో ఏటా మే నెలలో రైతులకు పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ఈ పథకాన్ని రైతు రక్ష పేరుతో ఈ ఖరీఫ్‌ నుంచే అమలు చేసి ఎకరానికి రూ.6 నుంచి రూ.10 వేలు వరకూ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎన్ని విడతలుగా ఇవ్వాలనే దానిపై విధివిధానాలు త్వరలో ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని కూడా కాపీ కొట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్ని విడతలుగా ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వారికి స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ రెండు పథకాలపై విధివిధానాలను రూపొందించి త్వరలో ప్రకటించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించిన మంత్రివర్గం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. కేంద్ర మంత్రుల రాష్ట్ర పర్యటనల సందర్భంగా లేఖల ద్వారా జవాబిస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పథకాలను కాపీ కొడుతున్నామనే విమర్శలపై ఎదురు దాడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top