సీఎం వైఎస్‌ జగన్‌పై పెరిగిన ప్రజామద్దతు | CCS Survey Says AP People Satisfied With CM YS Jagan Mohan Reddy Ruling | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌పై పెరిగిన ప్రజామద్దతు

Jun 22 2020 2:54 AM | Updated on Jun 22 2020 10:57 AM

CCS Survey Says AP People Satisfied With CM YS Jagan Mohan Reddy Ruling - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హవా మరింత పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ మళ్లీ భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఖాయం. ఏడాదిగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై ‘సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌’ (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు వెల్లడైంది. మొత్తం 2,881 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు.

వీరిలో 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 133–135 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంటుందని సీపీఎస్‌ తన సర్వేలో చెప్పింది. కాగా, సీపీఎస్‌ తాజా సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటుండగా.. 38.3 శాతం మంది టీడీపీని కోరుకుంటున్నారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలకూ కలిపి 5.3 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారు.  

ఇంగ్లీషు మీడియంకు జైజై
ఇక ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్‌ సంకల్పానికి 71.6 శాతం మంది జైకొట్టారు. 19.5 శాతం మంది మాత్రమే విభేదించారు. (అయితే ఈ అంశంపై మాత్రం సర్వేను గత ఏడాది నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 12 మధ్య కాలంలో నిర్వహించారు).

  • ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. 
  • కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని 75.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. 
  • వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని 63.9 శాతం.. నెరవేర్చడంలేదని 35 శాతం మంది చెప్పారు.
  • అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక శాతం మంది ప్రజలు హామీలు అమలవుతున్నాయని అంటే.. ప్రతిపక్షాలు మాత్రం వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించాయి.  

సంక్షేమానికి అపూర్వ మద్దతు
ఆర్థిక ఒడుదుడుకుల్లో కూడా సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 

  • జగన్‌ సంక్షేమ పథకాలు బాగున్నాయని రాష్ట్రంలో 65.3 శాతం ప్రజలు అభిప్రాయపడుతుండగా.. 33.7 శాతం మంది బాగోలేవన్నారు. అమరావతి ప్రాంతంలో సైతం సంక్షేమ పథకాలు బాగున్నాయని 59.5 శాతం మంది అభిప్రాయపడ్డారు.  
  • ఎస్‌ జగన్‌ పనితీరు బాగుందని 62.6% మంది ప్రజలు అభిప్రాయపడగా 36.1 శాతం మంది బాగోలేదన్నారు.

ప్రతి అడుగులోనూ నాన్నే నాకు స్ఫూర్తి
ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: ‘నాన్నే నా బలం. ప్రతి అడుగులోనూ ఆయనే నాకు స్ఫూర్తి. తండ్రులు పడే తపన.. వారు చేసే పోరాటం.. చూపించే ప్రేమ.. మద్దతు అంతా తమ పిల్లల అభివృద్ధిని కళ్లారా చూడ్డం కోసమే. తండ్రి మనకు మొట్టమొదటి మంచి స్నేహితుడు. మనలను తీర్చిదిద్దే వ్యక్తి.. మన హీరో.. అలాంటి వ్యక్తితో మనమెన్నో మధురమైన క్షణాలను పంచుకుంటాం. తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు.

యోగాకు విశిష్టమైన శక్తి ఉంది
‘మనిషికి ప్రశాంతతను, బలాన్ని ఇచ్చే విశిష్టమైన శక్తి యోగాకు ఉంది. అది మనిషి శారీరక రుగ్మతలను మాన్పడమే కాదు.. ఒక స్ఫూర్తినిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తరాలుగా వస్తున్న ఈ పురాతనమైన ప్రక్రియను మన జీవితంలో అంతర్భాగంగా చేసుకుందామని ప్రతినబూనుదాం’ అని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement