కప్పలవాగులో కొట్టుకుపోయిన కారు

Car Washed Away In Kappala Vagu - Sakshi

సాక్షి, కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు సమీపంలో ప్రవహిస్తున్న కప్పలవాగులో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఐదుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. చిత్తూరు జిల్లా వేంపల్లెకు చెందిన మధుసూదన్, మహేష్, మనోజ్‌కుమార్, మనోహర్, సోమశేఖర్‌ కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు సోమవారం కారులో బయలుదేరారు. అర్ధరాత్రి కావడంతో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా దొర్నిపాడు మండలం గుండుపాపల నుంచి లింగాల మీదుగా ప్రయాణం సాగించారు.

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కుందూ నదికి నీటిని విడుదల చేయడంతో ఇరవై రోజుల నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు సమీపానికి చేరుకున్నాక అర్ధరాత్రి కావడంతో కారు లైటింగ్‌లో వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయారు. కారును వేగంగా వాగులోకి దించడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ముందు కూర్చున్న వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో వెనుక కూర్చున్న ముగ్గురు అప్రమత్తమై డోర్‌ తెరుచుకుని వాగులోకి దూకారు. తర్వాత అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం గ్రామస్తులు వాగు వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు లాగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top