కానరాని కాంగ్రెస్ నేతలు | Canary Congress leaders | Sakshi
Sakshi News home page

కానరాని కాంగ్రెస్ నేతలు

Aug 22 2013 3:52 AM | Updated on Mar 18 2019 8:51 PM

జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 20 రోజులైనా ఇంతవరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సమైక్య ఉద్యమంలో పాల్గొనటం లేదు.

సాక్షి, తిరుపతి:  జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 20 రోజులైనా ఇంతవరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సమైక్య ఉద్యమంలో పాల్గొనటం లేదు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అసలు సమైక్యం మాటే ఎత్తటం లేదు. సాధారణ ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు మినహా సమైక్య ఉద్యమంలో గట్టిగా పాల్గొంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం.

జనం ముందుకు వస్తే తమను ఎక్కడ నిలదీస్తారోనన్న భయం కూడా కాంగ్రెస్ నాయకులను పీడిస్తోంది. ఉద్యమాలు చేస్తూ జైళ్లకు వెళ్తున్నవారిని పరామర్శించటం, ఎవరైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడకు వచ్చి మద్దతు ప్రకటించటం మినహా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి లేదు. తిరుపతి ఎంపీ చింతామోహన్ పార్లమెంట్ సమావేశాల పేరిట ఢిల్లీలోనే మకాం వేశారు. ఇంతవరకు తిరుపతి వీధుల్లోకి రానేలేదు. మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు పీసీసీ కార్యదర్శి గల్లా జయదేవ్  కంటి తుడుపుగా తిరుపతిలో ఒక రోజు ర్యాలీ నిర్వహించి చేతులు దులుపుకున్నారు.

జిల్లాలో ఏపీ ఎన్జీవోల నుంచి వ్యాపారుల వరకు అందరూ తమ వృత్తులను, ఉపాధిని వదులుకుని సమ్మె బాటపడితే, మంత్రి గల్లా అరుణకుమారి ఫ్యాక్టరీల్లో మాత్రం సమ్మెకు అనుమతివ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం సోదరుడు అయితే సమైక్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతుహలమ్మ ప్రత్యక్షంగా సమైక్య ఉద్యమంలో పాల్గొనలేదు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవిది కూడా అదే పరిస్థితి.

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాత్రం ఇటీవల రెండుసార్లు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, సీఎం సన్నిహితుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి కూడా ఇంత వరకు ప్రత్యక్ష ఉద్యమాలు నడపలేదు. కంటితుడుపు చర్యగా పలమనేరులో పాల్గొని మద్దతు ప్రకటించారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇదే. ఉద్యమకారులు జంతువుల రూపాలకు నేతల ఫొటోలు చేర్చి, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నా, టీవీ చానళ్లలో బహిరంగంగానే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఏకి పారేస్తున్నా స్పందించే పరిస్థితి లేదు.
 
నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు సమైక్య ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఉంటున్న మరో ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు కూడా ఇంత వరకు సమైక్య ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు. మరోవైపు మండలాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పట్టణాల్లో చోటా మోటా కాంగ్రెస్ నాయకులు ఉద్యమానికి దూరంగా ఉంటే ప్రజల్లో ఉనికి కోల్పోతామన్న భయంతో ఉద్యమకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement