బీపీ పెరుగుతోంది!! | BP is growing !! | Sakshi
Sakshi News home page

బీపీ పెరుగుతోంది!!

Aug 25 2017 3:09 AM | Updated on Apr 3 2019 4:37 PM

బీపీ  పెరుగుతోంది!! - Sakshi

బీపీ పెరుగుతోంది!!

రాష్ట్రంలో రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది.

- కోటిన్నర మందిలో సాధారణం కంటే ఎక్కువగా నమోదు
- మూడు జిల్లాల్లో పురుషుల కంటే మహిళల్లోనే బీపీ ఎక్కువ
- రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 17.8 శాతం
- మహిళల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 9.2 శాతం
- వ్యాధిపై అవగాహన లేక బాధితులుగా మారుతున్న గ్రామీణులు
- జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చు అంటున్న వైద్యులు


రాష్ట్రంలో రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అయితే ఇరవై ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వారిలోనే ఎక్కువగా బీపీ ఛాయలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎక్కువగా స్ట్రోక్‌ (పెరాలసిస్‌) వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ఏటా 40 వేల మందికి పైగా పెరాలసిస్‌ బారిన పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. మెదడులో రక్తస్రావం (బ్రెయిన్‌ హెమరేజ్‌) కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో నమోదవుతున్న ఈ కేసుల వివరాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు వెల్లడైంది.

రాష్ట్రంలో చాలా మందికి రక్తపోటు మీద ఏ మాత్రం అవగాహన లేదని సర్వేలో తేలింది. చాలామంది 45 ఏళ్లు వచ్చే వరకూ బీపీ పరీక్షలు చేయించుకోపోవడం విస్మయపరుస్తోంది. సాధారణంగా 120/80 నార్మల్‌ బీపీ. కానీ సగటున సాధారణం కంటే ఎక్కువ బీపీ ఉన్నవారిలో మహిళలు 7.6 శాతం ఉండగా, పురుషులు మాత్రం 11 శాతం ఉన్నారు. 180కి మించి బీపీ ఉన్నవారిలో 1.6 శాతం మంది పురుషులుండగా, 0.7 శాతం మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో  బీపీ నమోదైనవారు కోటిన్నర మంది వరకూ ఉన్నట్టు అంచనా.

– సాక్షి, అమరావతి

పురుషుల్లో వైఎస్సార్‌ కడప, విజయనగరం
బీపీ బాధితుల్లో పురుషుల విభాగంలో మొదటి స్థానంలో వైఎస్సార్‌ కడప ఉండగా, రెండో స్థానంలో విజయనగరం ఉంది. వైఎస్సార్‌ జిల్లాలో 17.8 శాతం మంది రక్తపోటు బాధితులున్నారు. కాగా విజయనగరంలో 15.9 శాతం మంది ఉన్నారు. మహిళల్లో అనంతపురం జిల్లాలో 9.2 శాతం మంది బీపీ బాధితులు ఉండగా, రెండో స్థానంలో కృష్ణా జిల్లాలో 9.1 శాతం మంది ఉన్నారు.

మూడు జిల్లాల్లో మహిళలే టాప్‌
ఆంధ్రప్రదేశ్‌లో 10 జిల్లాల్లో మహిళల కంటే పురుషుల్లోనే బీపీ బాధితులు ఎక్కువగా ఉండగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మహిళలే ఎక్కువ. కృష్ణాలో పురుషులు 8.6 శాతం ఉండగా మహిళలు మాత్రం 9.1 శాతం మంది ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో 8 శాతం మంది పురుషులు, 8.7 శాతం మంది మహిళలు, నెల్లూరు జిల్లాలో 7.1 శాతం మంది పురుషులు, 8.8 శాతం మంది మహిళలున్నారు. మారిన జీవన శైలి, ఆహార పదార్థాలు రక్తపోటు పెరగడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.

అధిక రక్తపోటుకు కారణాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది రక్తపోటు బాధితులుగా మారడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..
►   శరీర బరువు నియంత్రణలో లేకపోవడం
► విపరీతమైన పని ఒత్తిడి కారణంగా బీపీ రావడం
► వారానికి రెండ్రోజులు కూడా వ్యాయామం చేయకపోవడం
► అవగాహన లేక ఉప్పు అధికంగా వాడటం
► మాంసాహారం ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరిగి బీపీకి చేరువవడం
► జీవనశైలి కారణంగా అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర పోకపోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతోంది.

బీపీ నియంత్రణకు వైద్యుల చిట్కాలు
ఒక్కసారి రక్తపోటు వచ్చాక అది జీవితాంతం ఉంటుంది. దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం మినహా పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. నియంత్రణలో ఉంచుకోవాలంటే..
► రోజూ 30 నుంచి 40 నిముషాల పాటు వ్యాయామం చేయాలి.
► నిల్వ పచ్చళ్లను పూర్తిగా దూరంగా ఉంచాలి.
► టేబుల్‌ సాల్ట్‌ (అదనపు ఉప్పు) పెరుగులో, కూరల్లో అదనంగా వేసుకోవడం మానాలి.
► కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
► అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
► అధిక రక్తపోటు నియంత్రణకు ఈదడం, నడవడం చేయాలి.
► తక్కువ సోడియం ఉన్న పదార్థాలను తినాలి.
► ఆల్కహాల్‌ అలవాటున్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
► ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
► అధిక రక్తపోటు ఉన్న వారు ఆరుమాసాలకోసారి కిడ్నీ పరీక్షలు, ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలి.

ఏటా 10 వేల మంది శాశ్వత వికలాంగులుగా..
చాపకింద నీరులా విస్తరిస్తోన్న రక్తపోటు ఎన్నో కుటుంబాలను విధివంచితులుగా చేస్తోంది. ఏటా సుమారు 40 వేల పెరాలసిస్‌ కేసులు నమోదు అవుతుండగా.. అందులో సమయానికి వైద్యం అందకపోవడంతో సుమారు 10 వేల మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాలు, చేయి పడిపోవడం ద్వారా ఆయా బాధితులు కనీస పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నట్టు తేలింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో ఇలా బాధితులుగా మారుతున్నట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement