ఈతకెళ్లి బాలుడి మృతి | Boy Died in Canal PSR Nellore | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి బాలుడి మృతి

Jan 21 2019 1:02 PM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died in Canal PSR Nellore - Sakshi

సిద్దూ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

నెల్లూరు, సోమశిల: పండగ సెలవులకు బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలుడు సరదాగా స్నేహితులతో కలిసి ట్రైల్‌ రేస్‌ కెనాల్‌లో ఈతకెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన సోమశిలలో ఆదివారం జరిగింది. ఎస్సై పగడాల వెంకటసుబ్బారావు కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం నాగులచామవరానికి చెందిన కంచె సన్యాసిరావు, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమశిల హిల్‌ కాలనీలో ఉన్న తమ బంధువుల ఇంటికి సంక్రాంతి సెలవులకు వచ్చారు. వీరి రెండో కుమారుడు సిద్దూ (10) తన సహచరులతో కలిసి సోమశిల పంప్‌ హౌస్‌ సమీపంలోని ట్రైల్‌ రేస్‌ కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. కాసేపటికే గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంటనే పవర్‌ ప్రాజెక్ట్‌ వారికి సమాచారమిచ్చి నీటి విడుదలను నిలుపుదల చేశారు. ఘటన స్థలానికి చేరుకుని జాలర్ల సహాయంతో పెన్నా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల పాటు గాలింపు చేపట్టగా నీరు తగ్గుముఖం పట్టడంతో బాలుడు విగతజీవిగా తేలాడు. పండగకు వచ్చి మృత్యువాత పడిన కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్సై ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement