నామినీ ముసుగులో బినామీలు...?

Binami Delaers Caught In Government Net - Sakshi

వలలో చిక్కిన బినామీ డీలర్లు

అసలు డీలర్ల కోసం పరుగులు

5వ రోజూ తెరుచుకోని రేషన్‌ దుకాణాలు

నిరుపేద లబ్ధిదారుల గగ్గోలు

ప్రభుత్వం విసిరిన వలలో బినామీ డీలర్లు చిక్కుకున్నారు... రేషన్‌ సరుకుల పంపిణీకి డీలర్‌వేలిముద్రను మాత్రమే అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జారీ చేసిన సర్క్యులర్‌తో బినామీల బండారం బట్టబయలవుతోంది.నెల ప్రారంభమై ఐదురోజులు గడుస్తున్నా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రేషన్‌ దుకాణాలు తెరుచుకోని పరిస్థితి. సరుకుల కోసం లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు డీలర్‌ కోసం బినామీ
లు పరుగులు పెడుతున్నారు. పౌరసరఫరాలశాఖ మాత్రం సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తోంది. జిల్లాలో బినామీలు ఎవరూ లేరు..సాంకేతిక సమస్యతోనే దుకాణాలు తెరుచుకోలేదని పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తోందనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పుత్తూరు: ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీల రాజ్యం కుప్పకూలుతోంది. నామినీల ముసుగులో ఇన్నాళ్లుగా దుకాణాలు నడుపుతున్న బినామీలకు కాలం చెల్లినట్లే. ఈ పాస్‌ విధానం అమలులోకి వచ్చాక సరుకుల పంపిణీలో డీలర్లకు వెసులుబాటు కోసం నామినీల వ్యవస్థను ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఈపాస్‌ యంత్రంలో డీలర్‌తో పాటు నామినీల వేలిముద్రతో కూడా సరుకులు పంపిణీ చేసేఅవకాశం ఉండేది.

బినామీల పరమైన దుకాణాలు...
టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ అనుయాయులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా అప్పటి వరకు డీలర్లుగా ఉన్న వారిని నయానో భయానో బెదిరించి దుకాణాలను తమ పరం చేసుకున్నారు. ఈ పాస్‌ విధానం అమలు, కిరోసిన్, చక్కెర పంపిణీని రేషన్‌ దుకాణాల్లో నిలిపివేశాక డీలర్లకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో చాలామంది డీలర్లు వేరొకరిని తమ నామినీలుగా నమోదు చేయించి దుకాణాలను వారికి అప్పగించినట్లు సమాచారం. ఇలా దుకాణాలు నడుపుతున్న బినామీలు చేతివాటానికి తెరతీశారు. రేషన్‌ బియాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న సంఘటనల్లో బినామీ డీలర్లదే కీలకపాత్రగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు డీలర్లకు వెసులుబాటుగా ఉన్న నామినీ వ్యవస్థను ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. తప్పనిసరిగా డీలర్‌ వేలిముద్ర వేస్తేనే సరుకులను పంపిణీ చేసే విధంగా పౌరసరఫరాల శాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది.

తెరుచుకోని దుకాణాలు...
నెల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా జిల్లా వ్యాప్తంగా సుమారు 214 రేషన్‌ దుకాణాలు తెరుచుకోలేదు. డీలర్‌ వేలిముద్ర లేకుండా సరుకులు పంపిణీ చేయలేని పరిస్థితి ఉండడంతో దుకాణాలను మూసేసినట్లు సమాచారం. ఇదివరకే వేరే ఊర్లలో స్థిరపడిపోయిన అసలైన డీలర్లు వచ్చే వరకు సరుకుల పంపిణీ నిలిచిపోయినట్లే. దీంతో సరుకుల కోసం నిరుపేదలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క దుకాణం నెలకు రూ.600 వరకు పౌరసరఫరాల శాఖకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారుల కనుసన్నల్లోనే బినామీల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్‌ దుకాణాల్లో బినామీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలాంటిదేమీ లేదు...
రేషన్‌ దుకాణాల్లో బినామీ డీలర్ల వ్యవహారం మా దృష్టికి రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగానే జిల్లాలో కొన్ని దుకాణాలు తెరుచుకోలేదు. సమస్యను సరిదిద్ది, లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందిస్తాం.   
- చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరాల అధికారి, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top