బీసీల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా.. | BC Commission Bill as Targeting the advancement and empowerment of BCs | Sakshi
Sakshi News home page

బీసీల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా.. బీసీ కమిషన్‌ బిల్లు

Jul 23 2019 4:19 AM | Updated on Jul 23 2019 10:38 AM

BC Commission Bill as Targeting the advancement and empowerment of BCs - Sakshi

సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో చేసిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల అభ్యున్నతే లక్ష్యంగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ కమిషన్‌ ఏర్పాటుకుచట్టం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం. శంకర్‌ నారాయణ బీసీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల అడ్డంకులు, నినాదాలు, అధికార పార్టీ సభ్యుల హర్షాతిరేకాల మధ్య బిల్లును అసెంబ్లీ ముందుంచారు. 

శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా..
బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడంతోపాటు సాధికారత పెంచాలని ప్రభుత్వం బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో పేర్కొన్నారు. బీసీ కమిషన్‌ శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా పనిచేస్తుందని అందులో తెలిపారు. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను బీసీ కమిషన్‌ చూస్తుందని స్పష్టం చేశారు. కులధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పులు, తదితర అంశాలపై కమిషన్‌ పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు, సాంఘిక బహిష్కరణ అంశాలు కూడా కమిషన్‌ పరిధిలోకే వస్తాయి. కమిషన్‌ ఏర్పాటుతో బీసీల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను ఈ కమిషన్‌ కల్పిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు.

ఎవరైనా తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని కోరితే వారి వినతిని కమిషన్‌ అధ్యయనం చేసి, తగిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. బీసీలకు సంబంధించిన ఇతర అంశాలపైన కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫార్సులు చేయొచ్చు. విద్యా సంస్థల ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం వంటి ఫిర్యాదులపై కమిషన్‌ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. బీసీలతోపాటు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు చేస్తుంది. వీరి అభ్యున్నతికి అవసరమైన సిఫార్సులు చేసి.. విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అందుకు సంబంధించిన సిఫార్సులను కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కమిషన్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరించవచ్చు.  

బీసీ కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు
కొత్తగా ఏర్పాటు చేసే బీసీ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా హైకోర్టు జడ్జి ఉంటారు. సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన ఉన్న మరో ఇద్దరు, కమిషన్‌ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. వీరిపై ఏమైనా క్రిమినల్‌ కేసులున్నా, ఆశించిన రీతిలో విధులు నిర్వహించకుండా అసమర్థంగా వ్యవహరించినా, ఒకరిని ఒకరు దూషించుకున్నా, సెలవు పెట్టకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. చైర్మన్, సభ్యులు మీడియాకు ఎలాంటి విధానపర నిర్ణయాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. కాగా.. కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరినైనా తమ ముందు హాజరుకావాల్సిందిగా పిలిచే అధికారం ఉంటుంది. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారాన్ని ప్రభుత్వం నుంచి తీసుకునే అధికారం కలిగి ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతితో బీసీ కమిషన్‌ సాంకేతిక నిపుణుల సేవలను కూడా పొందొచ్చునని బిల్లులో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నందున బిల్లులో ఆర్థిక మెమోరాండంను కూడా పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,49,94,000 కేటాయించినట్లు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement