తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ అన్నారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ అన్నారు. గరుడ వాహనసేవను రాత్రి 8 గంటలకు ఆరంభించి రాత్రి ఒంటిగంట వరకు ఊరేగిస్తూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. అక్టోబర్ 5 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం ఈవో ఎంజీ.గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వీక్షించేందుకు 225 గ్యాలరీలు సిద్ధం చేశామన్నారు.
ఇందులో లక్షా 85 వేల మంది వాహనసేవలు కళ్లారా దర్శించే అవకాశముందన్నారు. నిర్ణీత వేళల్లో వాహన సేవలు నిర్వహిస్తామని, గరుడ వాహనసేవ రోజున వచ్చే ప్రతి ఒక్కరికీ ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కొత్త స్వర్ణరథం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బస్సుల సంఖ్య ను పెంచుతామన్నారు. భక్తుల సేవకు ఈసారి నిరంతరం పని చేసే సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇక్కడే అన్ని విభాగాలతో కూడిన అత్యవససర సేవలు ఉంటాయన్నారు.