తప్పు దిద్దుకోని ఏపీపీఎస్సీ

APPSC behavior as In contrast to the GO No 5 - Sakshi

జనరల్‌ కేటగిరీలో రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం లేకుండా చేసిన వైనం

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు సైతం బేఖాతరు

జీవో నంబర్‌ 5కు భిన్నంగా ఏపీపీఎస్సీ వ్యవహార శైలి

ఏపీపీఎస్సీ తీరుపై సర్వత్రా నిరసనల వెల్లువ

సాక్షి, అమరావతి: రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు జనరల్‌ కోటాలో అవకాశం ఉండదన్న ఏపీపీఎస్సీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులు వారి కేటగిరీలో మాత్రమే పోటీపడాలని గతేడాది డిసెంబర్‌లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏపీపీఎస్సీ స్పష్టం చేయడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అయితే ఏపీపీఎస్సీ మాత్రం తన తప్పును అంగీకరించడం లేదు. పైగా సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన జీవో నెంబర్‌ 5కు వక్రభాష్యం చెబుతోంది. గతేడాది జనవరి 5న ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్‌ 5 ప్రకారం.. జనరల్‌ కేటగిరీ పోస్టుల్లో రిజర్వుడ్‌ అభ్యర్థులు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వుడ్‌ కేటగిరీలో తగినంతమంది అభ్యర్థులు లేకుంటే కటాఫ్‌ మార్కులను తగ్గించి తీసుకోవచ్చని మాత్రమే జీవో చెబుతోంది. అయితే రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులు రిజర్వుడ్‌ కేటగిరీలోనే పోటీ పడాలని, జనరల్‌ కోటాకు అర్హులు కాదని ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లలో చేర్చింది.

ఇంతకుముందు వరకు లేని నిబంధనలు టీడీపీ పాలనలోనే రావడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు విద్య, ఉద్యోగ రంగాల్లో మెరిట్‌ కోటాలో ఉద్యోగాలు, సీట్లు సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఎంత మెరిట్‌ ఉన్నా రిజర్వుడ్‌ అభ్యర్థిగానే పరిగణిస్తారు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీవో నెంబర్‌ 5ను అమలు చేసే విధానాన్ని సూచిస్తూ మరికొన్ని కోర్టు ఉత్తర్వులతో కలిపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో గోపాలకృష్ణ ద్వివేది ఈ నెల 8న ఒక సర్క్యులర్‌ను ఏపీపీఎస్సీకి పంపారు. దీని ప్రకారం.. రిజర్వుడ్‌ అభ్యర్థులు జనరల్‌ కోటాలో పోటీ పడే అవకాశం ఉంది. అయితే దీన్ని కూడా ఏపీపీఎస్సీ పక్కనపెట్టింది.

ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
రిజర్వేషన్‌ ఉద్దేశం.. సామాజికంగా వెనుకంజలో ఉండి సమాజానికి దూరమవుతున్న వర్గాలను ఆదుకునేందుకే. ఈ మౌలిక సూత్రం తెలిసి కూడా పాలకులు ఈ విధంగా చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్‌ చివరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అన్యాయం చేసే విధంగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. 
– లెనిన్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి, ఏఐవైఎఫ్‌

రిజర్వేషన్‌లను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా, జీవో నెంబర్‌ 5కు విరుద్ధంగా మరో వాక్యం చేర్చింది. దీని ప్రకారం.. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులు రిజర్వుడ్‌ కేటగిరీలోనే పోటీపడాలి.. జనరల్‌ కోటాలో పోటీ పడేందుకు వీలులేదు. జీవోలో  లేనిది ఉన్నట్టు ఏపీపీఎస్సీ చూపించడం దారుణం. పైగా కొత్తగా జీవో ఇస్తే తప్ప తాను అనుకున్నది అమలు చేస్తానని ఏపీపీఎస్సీ చైర్మన్‌ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అన్యాయం చేయాలనే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. 
– ఎంవి. రవిశంకర్, ప్రధాన కార్యదర్శి,ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల అసోసియేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top