మొగదారమ్మను దర్శించుకున్న మంత్రి మోపిదేవి

AP Minister Mopidevi Goes To Hometown Nizampatnam - Sakshi

సాక్షి, గుంటూరు : పశుసంవర్ధకం, మత్య్స, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వస్థలం నిజాంపట్నానికి వెళ్లారు. ఈ ఆదివారం నిజాంపట్నంలోని మొగదారమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి స్వస్థలానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్‌లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్‌ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్‌ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్‌ జగన్‌ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు.

అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top