వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై ఆదేశాలు ఇవ్వలేం.. | AP High Court Comments On VVPAT Slips Counting | Sakshi
Sakshi News home page

వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై ఆదేశాలు ఇవ్వలేం..

May 22 2019 3:57 AM | Updated on May 22 2019 3:57 AM

AP High Court Comments On VVPAT Slips Counting - Sakshi

సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే.. అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. ఈ విషయాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున, అందుకు విరుద్ధంగా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొనగా.. కొట్టేస్తున్నట్లుగా పేర్కొనవద్దని, పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొనాలని పిటిషనర్‌ బాలాజీ అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను మూసేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఈవీఎంల కన్నా ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, తేడాలు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాలాజీ వాదనలు వినిపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీ ప్యాట్‌లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలు కోసం ఎన్నికల సంఘం ఎటువంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని తెలిపారు. వీవీ ప్యాట్లు, ఈవీఎంలకు మధ్య తేడాలు వస్తే, వాటిని అధిగమించేందుకు ఏం చేస్తారన్న విషయంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 

అలా చేయడం నిబంధనలకు విరుద్ధం 
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ స్పందిస్తూ... ఎన్నికల నిబంధనల ప్రకారం ముందు ఈవీఎంలనే లెక్కించాల్సి ఉందన్నారు. ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించడం చట్ట విరుద్ధమవుతుందని కోర్టుకు నివేదించారు. ఖర్చు చేయక ముందే ఆడిట్‌ చేయడం ఏ విధంగా సాధ్యం కాదో, ఈవీఎంలను లెక్కించకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించడం కూడా సాధ్యం కాదని వివరించారు. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు.

తాజాగా మంగళవారం కూడా మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్‌లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలుకు అన్నీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పిటిషనర్‌ చేస్తున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏ ఆదేశాలు ఇచ్చినా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. అవినాశ్‌ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వీవీ ప్యాట్‌ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు, అందుకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఎలా జారీ చేయగలమంటూ పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement