
సాక్షి, అమరావతి: అనస్థీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. మే 16 నుంచి ఆయన విశాఖపట్నం మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. డా.సుధాకర్ కావాలనుకుంటే ఆ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వొచ్చని, మరెక్కడికైనా వెళ్లి మరింత మెరుగైన వైద్యం పొందవచ్చని పేర్కొంది. ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ తెలిపింది. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మెరుగైన వైద్యం కోసం డా.సుధాకర్ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి కావొచ్చునని.. ఆయన సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
సీతమ్మధార (ఉత్తర): వివాదాస్పద వైద్యుడు సుధాకర్.. ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెల మే 16న మద్యం మత్తులో జాతీయ రహదారిపై కారును అడ్డంగా ఆపి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు, స్థానికులను దుర్భాషలాడిన ఘటనలో పోలీసులు వైద్యపరీక్షలు చేసి మానసిక ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. సుధాకర్‌ను డిశ్చార్జ్ చేసేందుకు హైకోర్టు సమ్మతించడంతో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి చెప్పారు.