మార్పునకు కట్టు'బడి'..

AP Government Has Come With School Transformation App To Maintain Transparency In School Education System - Sakshi

ప్రభుత్వ పాఠశాలల వాస్తవ సమాచారం నిక్షిప్తం

మొబైల్‌ యాప్‌లో ఫొటోలతో సహా అప్‌లోడ్‌

నేటి నుంచి 28 వరకు ప్రక్రియ 

నాలుగేళ్లలో సమూల ప్రక్షాళన    దిశగా ప్రభుత్వం కార్యాచరణ

జిల్లాలో 3,157 ప్రభుత్వ బడులకు ప్రయోజనం

సాక్షి, మచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పాఠశాల వాస్తవ సమాచారాన్ని సేకరించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న ప్రతి పాఠశాల స్థితిగతులను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎస్‌టీఎంఎస్‌) అనే యాప్‌లో సమస్తం నిక్షిప్తం చేసేలా ప్రణాళిక చేశారు.

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. పారదర్శకతకు పెద్ద పీట వేసేలా సమస్త వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎస్‌టీఎంఎస్‌) అనే యాప్‌ ద్వారా ప్రతీ ఒక్కరూ పాఠశాల స్థితిగతులను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 3,157 పాఠశాల సమస్త వివరాలను యాప్‌లో పొందుపరిచేందుకు విద్యాశాఖాధికారులు ప్రణాళిక చేశారు. ఇది పూర్తయితే పాఠశాలల సమాచారాన్ని సెల్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. 

28లోగా ప్రక్రియ పూర్తి..
‘స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’(ఎస్‌టీఎంఎస్‌) అనే సరికొత్త మొబైల్‌ బేస్డ్‌ యాప్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరచాలి. బుధవారం నుంచి ఈ నెల 27 వరకు ఫోటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను మరో సారి పరీక్షించుకోవాలి. యాప్‌ వినియోగాన్ని రెండు భాగాలుగా విభజించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యులుగా ఉండాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈవోలు బాధ్యులుగా ఉంటారు. అందుబాటులో ఉన్న సీఆర్పీల సేవలను వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 

‘ఐ–సంపద’ ఫొటోలు వద్దు..
విద్యా సంవత్సరం ప్రారంభంలో ‘ఐ–సంపద ’ పేరుతో పాఠశాలల ఫొటోలు, కొన్ని వివరాలను సేకరించిన విద్యాశాఖాధికారులు వాటిని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అనేక లోపభూయిష్ట విధానాలను గుర్తించారు. పైపై మెరుగులు కాకుండా కళ్లకు కట్టినట్లుగా క్షేత్రస్థాయి నుంచి వాస్తవ సమాచారం తెప్పించాలని ఆదేశించారు. దీంతో ఐ సంపద పేరుతో సేకరించిన ఫొటోలను వదిలేసి, వాటి స్థానంలో సరికొత్తగా వివరాల సేకరణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.   

యాప్‌ వినియోగించడం ఇలా..

  • ఉపాధ్యాయులు, సీఆర్పీలు మొబైల్‌బేస్డ్‌ యాప్‌ (స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)లోకి ప్రవేశించి కుడిపక్క మూలన ఉన్న డౌన్‌లోడ్‌ బటన్‌ను క్లిక్‌ చేసి.. ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • యాప్‌ను తెరిచిన తర్వాత పాఠశాల యూడైస్‌ నంబర్, లాగిన్‌ ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేస్తే, అప్పటికే దానిలో నిక్షిప్తమై ఉన్న ఆయా పాఠశాల వివరాలు కనిపిస్తాయి. ఉపాధ్యాయులు, సీఆర్పీలు తమ పాఠశాలను నిర్థారించుకోవాలి.
  • యాప్‌ను చేతితో పట్టుకొని పాఠశాల ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ప్రహరీలు, బయట సరిహద్దు వెంబడి ఫొటోలను తీయాలి. 
  • భవనాలు, పాఠశాలల అదనపు తరగతి గదులు, అందులో ఉన్న ఫ్యాన్‌లు, లైట్లు, వైరింగ్, స్విచ్‌ బోర్డులు ఫొటోలు త్చీయాలి.
  • అసలు విద్యుత్‌ సౌకర్యం ఉన్నదీ, లేనిదీ, మరుగుదొడ్లు, నీటి వసతి, ఫర్నిచర్, బ్లాక్‌ బోర్డులు వంటి వాటి ఫోటోలను వరుసుగా తీయాలి. 
  • కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఆట స్థలం, ఎంతమంది పిల్లలు ఉన్నారనే అంశాలను ఫొటోలు తీసి, వాటికి కేటాయించిన విభాగాల్లో యాప్‌లో అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి.
  • 3 నుంచి 5వ తగరతి వరకు, 6 నుంచి 8వ తరగతి వరకు, అదే విధంగా 9 నుంచి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది సూచిస్తూ అప్‌లోడ్‌ చేయాలి. 
  • యాప్‌లో ఒక సారి సబ్‌మిట్‌ నొక్కిన తర్వాత అప్‌లోడ్‌ చేసిన వివరాలను మళ్లీ అడుగుతుంది. ఆకుపచ్చ బటన్‌ నొక్కితే సేవ్‌ అవుతాయి. ఎర్రబటన్‌ నొక్కితే తిరిగి మెనూలోకి వెళ్లవచ్చు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top