శాసనమండలి రద్దు 

Andhra Pradesh Assembly Pass Dissolution Of Legislative Council - Sakshi

చట్టబద్ధ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ

రాజకీయ దుర్నీతికి వేదికగా మారిన మండలికి ముగింపు పలకాల్సిందేనని సభ్యుల స్పష్టీకరణ

ప్రజాస్వామ్యాన్ని మండలి అపహాస్యం పాలు చేసిందని వెల్లడి

ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డుపడుతోందని ధ్వజం

మండలితో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను గుర్తుచేసిన సభ

నాటి నిపుణుల సందేహాలను నేడు శాసనమండలి నిజం చేసిందని మండిపాటు

ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకునేందుకు టీడీపీకి సాధనంగా మారిందని విమర్శ

టీడీపీ అనుకూల మీడియా ద్వంద్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం

133 – 0 ఓట్లతో మండలి రద్దు తీర్మానానికి ఆమోదం

తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందిందన్న స్పీకర్‌.. శాసనసభ నిరవధిక వాయిదా

సాక్షి, అమరావతి: రాజకీయ దుర్నీతికి వేదికగా మారిన శాసనమండలికి చరమగీతం పాడాల్సిందేనని రాష్ట్ర శాసనసభ తేల్చి చెప్పింది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన మండలిని రద్దు చేయాలన్న చట్టబద్ధ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకంగా మారుతూ, ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారి రాజకీయ లబ్ధికి సాధనంగా మారుతున్న శాసనమండలి కథకు ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దు దిశగా ప్రధాన ప్రక్రియ సాఫీగా ముగిసింది. 

మండలి అనవసరం... వృథా వ్యయం
టీ విరామం తర్వాత శాసనసభ తిరిగి 11.58 గంటలకు ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’రాష్ట్ర శాసనమండలి రద్దుకు ఏపీ శాసనసభ తీర్మానిస్తున్నది’ అని పేర్కొంటూ చట్టబద్ధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్పీకర్‌ చర్చకు అనుమతించారు. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా శాసనమండలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసిందని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానంపై చర్చలో 16 మంది పాల్గొన్నారు. ప్రజాతీర్పును గౌరవించలేని మండలి అవసరం లేదని స్పష్టం చేశారు. మండలి రద్దు అప్రజాస్వామికమన్న టీడీపీ వాదనను సమర్థంగా తిప్పికొట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించని ఎగువ సభ అవసరం లేదని ఆనాడే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లు విస్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
తీర్మానానికి మద్దతుగా లేచి నిల్చున్న సభ్యులు 

మండలి అనవసరమని, దానివల్ల ఆర్థికంగా భారం పడుతుందని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న.. రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు ఏజే కామత్‌ అభిప్రాయాన్ని సభ్యులు ప్రస్తావించారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ఆమోదించిన బిల్లులను మరోసారి మండలికి పంపాల్సిన అవసరం ఏముందన్న రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు దేశ్‌ముఖ్‌ అభిప్రాయాన్ని కూడా సభ్యులు గుర్తుచేశారు. ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే సందేహించారో సరిగ్గా అదే రీతిలో ప్రస్తుత శాసనమండలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ శాసనమండలిని రద్దు చేయాలని ముక్తకంఠంతో కోరారు. 

ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన మండలి
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రస్తుత శాసనమండలి సైంధవ పాత్ర పోషిస్తోందని శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మీడియం బిల్లు, ఎస్సీ–ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు బిల్లులను అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని అడ్డుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై సభ్యులు మండిపడ్డారు. రూల్‌–71 కింద చర్చను అనుమతించడం ద్వారా దురుద్దేశంతో వ్యవహరించిందని విమర్శించారు. బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి నివేదించే విషయంలో మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే చైర్మన్‌ విచక్షణాధికారాల పేరిట ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.

ప్రజాక్షేమం వద్దా?  చంద్రబాబు లబ్ధే ముఖ్యమా...!
ప్రజల ప్రయోజనాల కంటే కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధికే శాసనమండలి పెద్దపీట వేసిందని శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టిన ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకునేందుకు మండలి టీడీపీకి ఓ సాధనంగా మారిందని సభ్యులు విమర్శించారు. అమరావతి ముసుగులో టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా జరిపిన భారీ భూదందాను కాపాడేందుకు మండలి రాజకీయ వేదికగా పనిచేసిందని దుయ్యబట్టారు. శాసన, పరిపాలన, న్యాయ రాజధానులను మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే యత్నాలను మండలి అడ్డుకోవడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఎండగట్టారు. 

ప్రజాస్వామ్య విలువలకు అద్దంపట్టిన సీఎం ప్రసంగం
మండలి రద్దు తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టింది. ఏడాది ఆగితే మండలిలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వస్తుందని తెలిసినప్పటికీ పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ మండలి రద్దుకు నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పడమే ఇందుకు నిదర్శనం. 

5 కోట్ల మంది అభ్యున్నతి కోసం మండలి రద్దు
 శాసనమండలి సభ్యులను ప్రభుత్వం ప్రలోభపెడుతోందంటూ టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై సభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాడు ఎన్టీఆర్‌ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తే కీర్తించిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు తాము అదే పనిచేస్తుంటే విమర్శిస్తోందని ధ్వజమెత్తింది. నాడు ఎన్టీఆర్‌ కేవలం ఓ వ్యక్తి (ఈనాడు రామోజీరావు) కోసం శాసనమండలిని రద్దు చేశారని...కానీ నేడు 5 కోట్లమంది రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తాము శాసనమండలిని రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే సభ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. 

మండలి రద్దుకు జనసేన సభ్యుడు రాపాక సహా సభకు హాజరైన 133 మందీ మద్దతు
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను సత్వరమే అమలు చేసేందుకు వీలుగా శాసనమండలి రద్దు కోసం తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అందరూ ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దాంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆ తీర్మానంపై సభ నిర్ణయం కోసం ఓటింగ్‌ / డివిజన్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులంతా లేచి నిలబడాలని కోరారు. సీఎం, అధికార పక్ష సభ్యులతోపాటు జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్‌ కూడా లేచి నిలుచున్నారు. వారు కూర్చున్న తర్వాత స్పీకర్‌ తీర్మానాన్ని వ్యతిరేకించే వారు లేచి నిలబడాలని కోరగా ఒక్కరు కూడా లేవలేదు. తటస్థంగా ఉండేవారు లేచి నిలబడాలని కోరినా ఎవరూ స్పందించలేదు. సభకు హాజరైన సభ్యులు అందరూ మద్దతు తెలపడంతో తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఓటేశారు. 

కాస్త గందరగోళం
కౌంటింగ్‌ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. తీర్మానానికి మద్దతుగా సభలో ఉన్న సభ్యులు అందరూ తమ స్థానాల్లో నిలబడ్డారు. శాసనసభ ఉద్యోగులు జట్లుగా విడిపోయి వరుసల వారీగా సభ్యుల స్థానాల వద్దకు వెళ్లి లెక్కించారు. ఆ ఓట్ల గణాంకాలను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఇచ్చారు. ఆయన వాటిని క్రోడీకరించి స్పీకర్‌కు అందజేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం తీర్మానానికి అనుకూలంగా 121 మంది ఓటు వేశారని, ప్రతికూలంగా, అలాగే తటస్థంగా కూడా ఎవరూ లేరని స్పీకర్‌ ప్రకటించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు సభ్యులు అభ్యంతరం తెలిపారు. 121 కంటే ఎక్కువమందే ఉన్నారని, మళ్లీ లెక్కించాలని కోరారు. దీంతో ఓట్లను మళ్లీ లెక్కించాలని స్పీకర్‌ శాసనసభ ఉద్యోగులను ఆదేశించారు. దాంతో ఉద్యోగులు మరోసారి సభ్యుల వద్దకు వెళ్లి ఓట్లను లెక్కించి వివరాలను స్పీకర్‌కు అందజేశారు. దాంతో శాసనమండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా సభలో 133 మంది ఓటు వేసినట్లు తమ్మినేని ప్రకటించారు. వ్యతిరేకంగా, అలాగే తటస్థంగా కూడా ఎవరూ లేరని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ‘రాజ్యాంగంలోని 169 (1) అధికరణ ప్రకారం కౌన్సిల్‌ రద్దు చేయాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం ఉండాలి. ఆ విధంగా ఈ తీర్మానం సభ ఆమోదం పొందింది’ అని స్పీకర్‌ తెలిపారు. తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. టీడీపీ సభ్యులు సోమవారం సభకు హాజరుకాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top