నిపా వైరస్‌పై అప్రమత్తం

Alert On The Infected Virus - Sakshi

పందుల యజమానులకు నోటీసుల జారీ

రేపట్నుంచి కార్పొరేషన్‌ పరిధిలో పందుల పట్టివేత

సాక్షి, నెల్లూరు సిటీ : తిరుపతిలో నిపా వైరస్‌ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు కార్పొరేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు. పందుల కారణంగా నిపా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని పట్టివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు పందుల యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి కార్పొరేషన్‌ పరిధి లోని పందులను ఇతర ప్రాంతాలకు తరలిం చడం, కాల్చివేయడం చేయనున్నారు.

నగరంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పందుల యజమానులను అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. కార్పొరేషన్‌ అధికారులు అప్పుడప్పుడు తూతూమంత్రంగా పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో పందుల పెంపకందారులు సుమారు 200మందికి పైగా ఉన్నారు. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, బీవీనగర్, కొండాయపాళెంగేటు, కుక్కలగుంట, తదితర ప్రాంతాల్లో పందుల పెంపకం చేపడుతున్నారు. నగరంలో దాదాపు 5వేలకు పైగా పందులు సంచరిస్తున్నాయి. 

పందుల యజమానులకు నోటీసులు 
పందుల పెంపకందారులకు కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గతంలో పందులను తరలించే క్రమంలో పెద్ద ఎత్తున పందుల యజమానులు అడ్డుకోవడం, నాయకుల ఒత్తిళ్లతో అధికారులు వెనక్కుతగ్గడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం నిపా వైరస్‌ కలకలంతో అధికారులు చెన్నైకు చెందిన ప్రత్యేక బృందాలతో పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టనున్నారు. పందుల యజమానులు అడ్డుకోకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పందుల యజమానులు పందుల పట్టివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సిందే.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top