అమ్మో.. చలి | Ah .. the cold | Sakshi
Sakshi News home page

అమ్మో.. చలి

Jan 12 2015 3:04 AM | Updated on Sep 2 2017 7:34 PM

అమ్మో.. చలి

అమ్మో.. చలి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. రెండు రాష్ట్రాలనూ మంచుదుప్పటి కమ్మేస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోతున్నాయి.

  • రెండు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • సాక్షి, హైదరాబాద్ / కొండాపురం (నెల్లూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. రెండు రాష్ట్రాలనూ మంచుదుప్పటి కమ్మేస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోతున్నాయి. భారీ ఎత్తున మంచు కురవడం, చలిగాలులు వీస్తుండటంతో ప్రజల పరిస్థితి మంచుగడ్డపై కూర్చున్నట్టుగా మారింది. ముఖ్యంగా గడిచిన నాలుగు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఉదయం 10 గంటల వరకూ ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

    రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల స్థాయికి పడిపోయాయి. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తీవ్రమైన చలిగాలుల కారణంగానే ఇక్కడ పరిస్థితి నెలకొందని చెప్పారు. కాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 10 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

    ఖమ్మం జిల్లా భద్రాచలం, నల్లగొండల్లో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. చలికి స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నవారు అనుమానంతో ఆసుపత్రులకు పరుగు పెడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం కూడా తగ్గుతుందని అటు వాతావరణశాఖ, ఇటు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
     
    ఏజెన్సీల్లో మరీ ఎక్కువగా...

    రికార్డుస్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ విషమంగా ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది. ఇక్కడ నీరు గడ్డకట్టే స్థాయిలో చలి తీవ్రత ఉంది. ఇక చింతపల్లిలో మూడు డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద ఐదు డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు గుడి ప్రాంతంలో రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నందిగామ, రెంటచింతలలో 10 డిగ్రీల కనిష్ట ఉషోగ్రత నమోదైంది.

    అనంతపురంలో 11.9, కర్నూలులో 12.9, ఆరోగ్యవరం, బాపట్లలలో 13, కళింగపట్నంలో 13.6, విజయవాడలో 15, తిరుపతిలో 15.5, కాకినాడలో 16.2, నెల్లూరులో 19.4, విశాఖపట్నంలో 19.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. రంపచోడవరం, చింతపల్లి, పాడేరు, సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు అలాగే ఉంటోంది. దీంతో రోడ్లు కూడా కనిపించక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తిరుమలలో చలి ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement