నీరుగారుతున్న అవినీతి కేసులు

ACB Failed in Bribery Demands Stops Chittoor - Sakshi

లంచావతారుల భరతం పట్టడంలో ఏసీబీ విఫలం

సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టుల్లో వీగిపోతున్న కేసులు

లంచావతారులు మళ్లీ దర్జాగా ఉద్యోగంలోకి..!

చేరిన వెంటనే మళ్లీ అవినీతి బాట

నాలుగేళ్లలో ఒక్కరికీ శిక్షపడిన దాఖలాల్లేవ్‌!

అవినీతి అధికారుల ఆట కట్టించడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు  శక్తి చాలడం లేదు. గత నాలుగేళ్ల కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా 10 మందికిపైగా అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కానీ కేసుల్లో బలం లేకపోవడం, చట్టంలో ఉన్న లొసుగులు, సాక్షులను బెదిరించడం..ఇత్యాది కారణాల వల్ల ఈ కేసులు నీరుగారిపోతున్నాయి. పలువురు అవినీతిపరులు మళ్లీ నెలల వ్యవధిలోనే ఉద్యోగంలో చేరుతున్నారు! కొందరు ఏకంగా ప్రమోషన్లు కూడా పొందారు. దీనికి అధికార పార్టీ నాయకులు ఇతోధికంగా సహకరించడమే కారణమనే విమర్శలొస్తున్నాయి.

చిత్తూరు, సాక్షి: ఒక చిరుద్యోగి చిన్న తప్పు చేస్తే సస్పెండ్‌ చేస్తున్నారు. అయితే, అధికారులు వేలా ది రూపాయలు లంచంగా పుచ్చుకుని ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే అతన్ని కూడా సస్పెండ్‌ చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు వేతనానికి మించి 10 నుంచి 15 రెట్లు లంచాలు తీసుకుంటున్నారంటే అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్‌ పెట్టాల్సిన ఏసీబీ పనితీరు కూడా సక్రమంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏసీబీకి పట్టుబడిన లంచావతారులు మూడు నుంచి ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ దర్జాగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. మళ్లీ లం చాలతారులై పీడిస్తున్నారు. కేసుల మాఫీ కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకు రెండింతలు లంచాల రూపేణా ప్రజల నుంచి పిండుకుంటున్నారు.

అన్నీ ఉత్తమాటలే..
‘అక్రమార్కులను వదిలేదు..ఎంతటివారైనా సహించేది లేదు..చట్టం తన పని తాను చేసుకుపోతుంది...కఠినంగా శిక్షిస్తాం’ అని చెప్పే ఏసీబీ అధికారులు మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు.  ఈ నాలుగేళ్లలో ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వోద్యోగులు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.? ఎన్ని ఫిర్యాదులు వస్తే ఎంతమందిపై దాడులు చేశారు..? విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడిన బడా అక్రమార్కులు ఎంత మందిని కటకటాల పాల్జేశారు? ఈ లెక్కలు తీస్తే ఏసీబీ వైఫల్యం ఇట్టే అవగతమవుతుంది.  అవినీతి అధికారికి శిక్షపడకుండా కేసులు పెడుతూ.. కోర్టుకు బలహీనమైన సాక్ష్యాలు దాఖలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దాదాపు నాలుగు నెలల క్రితం సమాచార శాఖలో ఇంజినీర్‌ నాగేశ్వరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేవలం నాలుగు నెలలు జైల్లో ఉండి దర్జాగా ఆయన బయటికొచ్చాడు. మరో రెండు మూడు వారాల్లో ఉద్యోగంలో చేరుతాడని అధికారులు చెబుతున్న సమాచారం. జిల్లాలో ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క అవినీతి అధికారికి కూడా శిక్ష పడలేదంటే లోపాలేమిటో ఏసీబీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటోంది. కలకడలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ మహిళా తహసీల్దార్‌ సంవత్సరం తిరక్కుండానే మళ్లీ విధుల్లో చేరింది.

చేయి తడపనిదే..
ఇప్పుడు జిల్లాలో ఏ ప్రభుత్వ శాఖలోకి వెళ్లినా చేయి తడపనిదే పనులు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శిని కలవాలంటే ముందు బయట ఉండే గుమస్తాకు రూ.50 ఇస్తేనే ఆయన దర్శనభాగ్యం కలుగుతుంది. తహసీల్దార్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకోవాలని ఆఫీసుకు వెళితే ఎర్రబిళ్ల జవానుకు రూ.100 ఇవ్వాల్సిందే. ఎంపీడీఓ కార్యాలయంలో పని కావాలంటే జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి ఎంపీడీఓ వరకు ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి జేబుల్లో నోట్లు ఇచ్చుకుంటూ పోతే తప్ప పనులు కావడం లేదు. డబ్బులు ఇవ్వకపోతే సదరు వ్యక్తి ఫైలు నెలలేమిటి? ఏళ్ల తరబడి కార్యాలయంలోనే బూజుపట్టి పెండింగ్‌లో ఉంటోంది.  ప్రజల జీవన విధానంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పలు పనులు ముడిపడి ఉన్నాయి. నిత్యం ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వందలాది మంది కార్యాలయాలకు వస్తుంటారు.

వీరిలో నూటికి 80 శాతం ప్రజానీకం ఆయా కార్యాలయాల్లో దిగువ సిబ్బంది నుంచి పై అధికారి వరకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే రోజుకు వివిధ పనులకు గాను ప్రజలు చెల్లించే లంచం రూ.2 కోట్లు పైమాటే ఉంటుందని అనధికార అంచనా. మంచి ఆదాయం ఉన్న శాఖల్లో కుర్చీల కోసం పలువురు అధికారులు వెంపర్లాడుతున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని లక్షలు వెచ్చించి వారికి కావాల్సిన స్థానాన్ని దక్కించుకుంటున్నారు. ఇది అన్ని పట్టణాలు, మండలాల్లో జరిగే తంతే! అధిక సంపాదనకు కొన్ని కార్యాలయాలు అడ్డాగా మారాయి. రెవె న్యూ, ఎంపీడీఓ, ఉపాధి, ఆర్‌డబ్ల్యూఎస్, పంచా యతీరాజ్, ఇరిగేషన్, ఐసీడీఎస్, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, సోషల్‌ వెల్ఫేర్, నీటిపారుదల, వ్యవసాయశాఖ, డ్వామా, సబ్‌ రిజిస్ట్రార్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనకొం డలు ఉన్నాయి. ఆ శాఖలోని ఫైళ్లు ఎలా పేరుకుపోతున్నాయో అలాగే కుర్చీలు వదలడం లేదు. చేయి తడపనిదే పనిచేయడం లేదంటే అతిశయోక్తి లేదు. పనికో రేటుతో పిండేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top