సర్కారు కాలేజీలు సూపర్‌

Above 73 percent pass percentage in 151 Government Degree Colleges - Sakshi

151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 73.66 శాతం ఉత్తీర్ణత 

1,153 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 30 శాతమే ఉత్తీర్ణత 

40 శాతం మంది ప్రైవేట్‌ కాలేజీ విద్యార్థులు తుది పరీక్షకు గైర్హాజరు 

ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 87 శాతం ఉత్తీర్ణత 

‘ప్రైవేట్‌’లో అది 57 శాతమే

ప్రమాణాలు పాటించని 500 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు..

200 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు మూసేయాలి 

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్కరణల కమిటీ నివేదిక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాలివీ..
- ప్రభుత్వ రంగంలోని డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా ప్రైవేట్‌ సంస్థల్లో బాగా తక్కువగా ఉంది. 
ప్రైవేట్‌ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు.
71% ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి.
అలాగే.. 40 శాతం ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయి.
58 శాతం ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. 
దీంతో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది.

ఉత్తీర్ణతలో ‘ప్రైవేట్‌’ అథమం
రాష్ట్రంలో 1,153 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 30 శాతమే ఉందని, అంతేకాక.. ఈ కాలేజీల్లో 40% మంది తుది పరీక్షకు గైర్హాజరవుతున్నారని కమిటీ గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని కాలేజీలను కూడా సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే, 25 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ఎయిడెడ్‌ కాలేజీల్లో 25% కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉంటున్నాయని తెలిపింది. మరోవైపు.. గత సర్కారు 13 ప్రభుత్వ కాలేజీలను మంజూరుచేసి చేతులు దులుపుకుందని, వాటికి సిబ్బందిని మంజూరు చేయలేదని కమిటీ పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top