పగటి పూటే 9గంటల విద్యుత్‌

9 hours of electricity to farmers in day time - Sakshi

రాత్రి పూట కష్టాల నుంచి రైతన్నకు ఊరట

తేదీ ఖరారుకు సర్కార్‌ ఆదేశాలు

హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు 

13న కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు 

సాక్షి, అమరావతి: రైతన్నల కష్టాలు తీరబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్‌ అందించబోతున్నారు. ఈ మేరకు ఎప్పటి నుంచి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తారో ఆ తేదీని ఖరారు చేయాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నేతృత్వంలో ఈ అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఈ నెల 13న ఎప్పటి నుంచి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నారో ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లోనూ దఫాల వారీగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. పగలు కంటే రాత్రే ఎక్కువగా విద్యుత్‌ ఇస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరికే సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. వ్యవసాయ క్షేత్రాలను సమగ్రంగా తడుపుకోలేని దుస్థితి ఉంది. రాత్రిపూట కరెంటు ఇస్తుండటంతో రైతులు నిద్ర మానుకుని పొలాల్లో కాపు కాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో చీకట్లో విష పురుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది చీకట్లో అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్‌ తీగల వల్ల కరెంట్‌ షాకుకు గురై మరణిస్తున్నారు. దీన్ని పూర్తిగా మార్చాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

టీడీపీ పాలనలో ప్రచారాస్త్రంగానే ఉచిత విద్యుత్‌ 
ఉచిత విద్యుత్‌ పథకం గత టీడీపీ ప్రభుత్వంలో ప్రచారాస్త్రంగానే మిగిలిపోయింది. ఎక్కడా చిత్తశుద్ధితో అమలు కాలేదు. నాలుగున్నరేళ్లు రోజుకు 7 గంటలు విద్యుత్‌ ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పుకుంది. అయితే, ఇది కేవలం కాగితాల్లో లెక్కలకే పరిమితమైంది. వ్యవసాయ రంగానికి ఏటా 23,020 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కావాల్సి ఉండగా 13,480 మిలియన్‌ యూనిట్లు ఇచ్చి టీడీపీ సర్కార్‌ చేతులు దులుపుకుంది. నిరంతరాయంగా పగటి పూట విద్యుత్‌ సరఫరా చేయాలంటే ఇప్పుడున్న విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో మార్పు తేవాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు సబ్‌స్టేషన్లను మరింత బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం ఇవేమీ  పట్టించుకోలేదు. కేవలం ముడుపులు అందే విద్యుత్‌ లైన్లపైనే శ్రద్ధ పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పగించింది. ఇక ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. రైతన్నలకు అవసరమైన విద్యుత్‌ సరఫరా బలోపేతానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి.  

డిస్కమ్‌లను ముంచేసిన బాబు పాలన 
విద్యుత్‌ పంపిణీ సంస్థలు (ఏపీ డిస్కమ్స్‌) వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఈ మొత్తాన్ని సబ్సిడీగా డిస్కమ్‌లకు ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా సబ్సిడీ ఇస్తూ డిస్కమ్‌లను అప్పులపాలు చేసింది. గత రెండేళ్లుగా ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వలేదు. 2018–19లో రూ.6,030 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే.. కేవలం రూ. 1,250 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2019–20లో రూ.7,064 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన మొత్తాన్ని విద్యుత్‌ సంస్థల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలని ఉచిత సలహా పారేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top