వలంటీర్‌ పోస్టులకు.. 71,098 దరఖాస్తులు

71,098 Applications For Volunteer Posts - Sakshi

సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపటిన గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల పర్వం ముగిసింది. ఈ పోస్టులకు విశేషస్పందన లభించింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున నియమిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిని బట్టి జిల్లాకు గ్రామీణ ప్రాంతాల నుంచి  12,272 మంది వలంటీర్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటికి శుక్రవారం నాటికి జిల్లాలో 71,098 మంది దరఖాస్తు చేసుకున్నారు. 56,026 మంది దరఖాస్తులు పరిశీలన చేయగా, 53,503 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయి. 2,523 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. 15,072 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. తిరస్కరించిన దరఖాస్తులను ఈ నెల 8లోగా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.

భర్తీకి జెడ్పీ సీఈవో సమన్వయకర్తగా..
అర్హత లేకపోవడం, కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలు దరఖాస్తులను తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి జెడ్పీ సీఈవో రమణమూర్తి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలో నియామకాలను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడమే కాకుండా స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీర్లకు 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఎంపిక విషయాలను తెలియజేస్తూ లేఖలు పంపే అవకాశం ఉంది. ఎంపికైన వలంటీర్లకు వచ్చే నెల 5 నుంచి పదో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 

50 ఇళ్లు ఒక గ్రూపుగా..
సర్వే అధారంగా 50 ఇళ్లకు ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీతో కూడిన కమిటీ ఇళ్ల గ్రూపులను వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్ల కన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపుల్లో సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

దరఖాస్తుల వెల్లువ
గ్రామ వలంటీర్ల పోస్టులకు జిల్లాలో 39 మండలాల నుంచి 71,098 దరఖాస్తులు వచ్చాయి.  వీటిలో 56,026 దరఖాస్తులు పరిశీలించారు. 53,503 దరఖాస్తులను ఆమోదించారు. 2,523 దరఖాస్తులు తిరస్కరించారు. 15, 072 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. 
► హుకుంపేట మండలం నుంచి అత్యధికంగా 2804 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1751 దరఖాస్తులను పరిశీలించగా,1701 ఆమోదించారు. వివిధ కారణాలతో 50 దరఖాస్తులు తిరస్కరించారు.
చోడవరం మండలంలో 2713 దరఖాస్తులు రాగా,2671 దరఖాస్తులు పరిశీలించగా, 2525 దరఖాస్తులు ఆమోదించారు. 146 దరఖాస్తులు తిరస్కరించారు.
► అనకాపల్లి మండలంలో 2447 మంది దరఖాస్తు చేసుకోగా,1323 మంది దరఖాస్తులు పరిశీలించారు. 1200 దరఖాస్తులు ఆమోదించారు. 251 దరఖాస్తులు తిరస్కరించారు. 
అరకు మండలం నుంచి 2344 మంది దరఖాస్తు చేసుకోగా,1255 మంది దరఖాస్తులను పరిశీలించారు. 1204 దరఖాస్తులు ఆమోదించగా,  51 దరఖాస్తులు తిరస్కరించారు. 
► యలమంచలి మండలం నుంచి అతితక్కువ దరఖాస్తులు వచ్చాయి. 660 మంది దరఖాస్తు చేయగా, 463 దరఖాస్తులను పరిశీలించారు. 442 దరఖాస్తులను ఆమోదించారు. 21 తిరస్కరించారు. 
నర్సీపట్నం మండలంలో 901 మంది దరఖాస్తు చేసుకున్నారు. 865 దరఖాస్తులను పరిశీలన చేయగా, 621 ఆమోదించారు. 244 దరఖాస్తులు తిరస్కరించారు. 
కోటవురట్ల మండలంలో 1222 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 882 పరిశీలించగా, 881 ఆమోదించారు. ఒక దరఖాస్తును తిరస్కరించారు. 
రోలుగుంట మండలంలో 1366 మంది దరఖాస్తు చేయగా, వీటిలో 1221 దరఖాస్తులను పరిశీలించారు.1212 ఆమోదించారు. 9 దరఖాస్తులను తిరస్కరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top