ఏకోపాధ్యాయ.. బోధన మిథ్య | 55 GO become the scourge of the poor kids | Sakshi
Sakshi News home page

ఏకోపాధ్యాయ.. బోధన మిథ్య

Sep 8 2014 11:35 PM | Updated on Jul 26 2019 6:25 PM

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని చెబుతున్న సర్కారు మాటలకు.. చేతలకు పొంతన కుదరని పరిస్థితి.

కోవెలకుంట్ల:  ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని చెబుతున్న సర్కారు మాటలకు.. చేతలకు పొంతన కుదరని పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా.. పోస్టులను కుదించి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. ఫలితంగా గ్రామీణ విద్యార్థులకు విద్య క్రమంగా దూరమవుతోంది. వేలాది రూపాయల డొనేషన్లతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేక తల్లిదండ్రులు ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.
 
మూడేళ్ల క్రితం అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా జారీ చేసిన జీవో 55 నిరుపేద విద్యార్థులకు శాపంగా మారింది. జిల్లాలో 1,835 ప్రాథమిక.. 447 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, జీవో ప్రకారం 394 ప్రాథమిక, 13 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏకోపాధ్యాయులే దిక్కయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అధిక శాతం 25 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయినప్పటికీ 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తుండటం చూస్తే విద్యార్థులకు ఏ స్థాయిలో న్యాయం చేకూరుతుందో అర్థమవుతోంది. మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం 1, 2 తరగతులకు బోధించడమే కష్టమైన పరిస్థితుల్లో.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులను బోధించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది.
 
ఇక ఉదయం ప్రార్థన మొదలు.. సాయంత్రం బడి ముగిసే వరకు ఒక్క ఉపాధ్యాయుడు అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ కాంప్లెక్స్ రికార్డులు.. విద్యా బోధన.. విరామ సమయంలో ఆటలపోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదునివ్వడం వారికి తలకు మించిన భారమవుతోంది. అనివార్య కారణాలతో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. చాలా వరకు పాఠశాలలు మూతపడుతున్నాయి. ఏకోపాధ్యాయులు మండల విద్యాధికారి అనుమతితో సెలవు తీసుకోవాల్సి ఉండగా.. ఆ అధికారి తన ఆధీనంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్, సమీప పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపాల్సి ఉంటోంది.
 
అనారోగ్యంతో వారం రోజులకు పైబడి సెలవు పెడితే డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు పూర్తి చేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదిలాఉంటే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు చుక్కలు చూపుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. గత మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలపై దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement