వణుకుతున్న బెజవాడ..  | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి

Published Mon, Apr 27 2020 10:42 AM

179 Corona Positive Cases in Krishna District - Sakshi

సాక్షి, అమరావతి : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 210కు పెరిగింది. జిల్లాలో మొత్తం 177 కేసులు ఉండగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 11 గంటల మధ్య మరో 33 కొత్త కేసులు జిల్లాలో నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి పెరిగాయి. అలాగే 173 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 29మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో ఇప్పటివరకూ 8మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్‌-19 పరీక్షల్లో 80 కేసులు పాజిటివ్‌గా నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1177 పాజిటివ్‌ కేసులకు గానూ 235మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 31మంది మృతి చెందారు. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం 911మంది చికిత్స పొందుతున్నారు.

వణుకుతున్న బెజవాడ.. 
జిల్లాలో ఆదివారం నమోదైన 52 కేసుల్లో 45 విజయవాడ నగరంలోనే ఉన్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్తగా బయటపడుతున్న కేసులన్నీ ఒకటీ ఆరా తప్ప మిగతా అన్నీ విజయవాడకు చెందినవే ఉంటున్నాయి. తాజాగా విజయవాడలో బయటపడిన కేసుల్లో కార్మికనగర్‌కు చెందిన 19 మందికి వైరస్‌ సోకింది. ఒక యువకుడు దుబాయి నుంచి వచ్చి.. హోం క్వారంటైన్‌ సక్రమంగా పాటించకపోవడంతో ఈ వ్యాప్తి జరిగింది. అతని తండ్రి, చుట్టుపక్కల ఉండే మరో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా వీరి నుంచి మరో 19 మంది వైరస్‌ బారిన పడ్డారు. కృష్ణలంకలో 9 మందికి వైరస్‌ సోకగా.. అందులో భ్రమరాంబపురంలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 4 నెలల చిన్నారి ఉండటం ఆందోళన రేపుతోంది. (మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ)

రామవరప్పాడులో కానిస్టేబుల్‌కు..
విజయవాడ గాంధీనగర్‌లో ఆరుగురికి  వైరస్‌ సోకగా అందులో నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. అలాగే మధురానగర్‌లో 5, కేదారేశ్వరపేటలో 3, పెనమలూరు 5, విద్యాధరపురం, యారంవారి వీధి,  ఉంగుటూరు మండలం తరిగొప్పుల, అజిత్‌సింగ్‌ నగర్‌లోని గీతామందిర్‌ కాలనీ, సీతారామపురంలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే రామవరప్పాడులో నివసిస్తున్న ఒక కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మిగిలిన సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. (ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్: కృష్ణా కలెక్టర్)

లారీ డ్రైవర్‌పై కేసు 
వైరస్‌ వ్యాప్తికి కారణమైన లారీ డ్రైవర్‌పై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక గుర్రాల వీరరాఘవయ్య వీధికి చెందిన వ్యక్తి లారీ డ్రైవరుగా పనిచేస్తుంటాడు. అతను ఇటీవలే పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి వచ్చాడు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి ఇంటి చుట్టుపక్కల వారితో పేకాట, హౌసి వంటి జూదాలు ఆడాడు. అతనికి కొద్దిరోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అతనితో కలసి ఆటలాడి, సన్నిహితంగా మెలిగిన వారిలో సుమారు 20 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాగా.. వీరిలో ఒకరు మరణించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. (పేకాట సరదా.. 25 మందికి కరోనా..)

Advertisement
Advertisement