ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరిగిపోవడంతో నడవలేక పోతున్న ఓ 103 ఏళ్ల వృద్ధుడికి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరిగిపోవడంతో నడవలేక పోతున్న ఓ 103 ఏళ్ల వృద్ధుడికి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వందేళ్ల పైబడిన వారికి ఇలాంటి సర్జరీ చేయడం చాలా అరుదని, దేశంలోనే ఇది రెండోదని జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ మిథిన్ ఆచి చెప్పారు. బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జహీరాబాద్‌లోని మొగడంపల్లి గ్రామానికి చెందిన బి. ఎస్.మాణిక్యం(103) ఇటీవల ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు ఆయన తుంటి ఎముక విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 26న శస్త్రచికిత్స చే శారు. ప్రస్తుతం మాణిక్యం కోలుకున్నట్లు ఆచి చెప్పారు.
జొన్నరొట్టె, నాటుకోడి పులుసే ఆరోగ్య రహస్యం!: నిండా మూడు పదుల వయసు కూడా నిండని అనేక మంది యువతీయువకులు మధుమేహం, గుండె, మూత్ర పిండాల జబ్బుల బారిన పడుతున్న నేటి రోజుల్లో.. 103 ఏళ్ల వయసులో కూడా బీఎస్ మాణిక్యం ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సొంత పనులన్నీ ఆయనే చేసుకుంటారు. జొన్నరొట్టె, నాటు కోడి పులుసు, సహజ సిద్ధంగా పండించిన పండ్లు, కాయకూరలే తన ఆహారం అని ఆయన చెప్పారు. మాణిక్యం, కమల దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, 57 మంది మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. 20 మంది మునిమనుమళ్లు ఉన్నారు. 30 ఏళ్ల వయసులోనే స్థానికంగా ఓ చర్చ్‌కి పాదర్‌గా ఎంపికై, 18 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్న మాణిక్యం వారికి సొంత ఖర్చులతో పెళ్లిళ్లు కూడా చేశారు.