అరుదైన ఘనత సాధించిన జైస్వాల్‌ | Yashasvi Jaiswal scripts another milestone in style as he completes 4000 T20 runs | Sakshi
Sakshi News home page

అరుదైన ఘనత సాధించిన జైస్వాల్‌

May 18 2026 12:03 PM | Updated on May 18 2026 12:23 PM

Yashasvi Jaiswal scripts another milestone in style as he completes 4000 T20 runs

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని తాకి.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (116 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ (117), తిలక్‌ వర్మ (125) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ కూడా 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ కేవలం 107 ఇన్నింగ్స్‌ల్లోనే 4000 టీ20 పరుగులు పూర్తి చేశాడు. గేల్‌ తర్వాతి స్థానాల్లో షాన్‌ మార్ష్‌ (113), బాబర్‌ ఆజం (115), డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ (116) ఉన్నారు.

ఇటీవలే గుజరాత్‌ యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు జైస్వాల్‌ ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం భారత యువ బ్యాటర్ల దూకుడుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 17) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో​ జైస్వాల్‌ 12 పరుగులకే ఔటైనా ఈ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఢిల్లీ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

మరోపక్క ఢిల్లీ ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్‌ అశలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌పై గెలిచి ఆర్సీబీ ఈ సీజన్‌ తొలి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఏడు జట్లు అధికారికంగా రేసులో ఉన్నాయి. లక్నో, ముంబై రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement