ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం | Telugu Association of London TAL Premier League 2026 Edition | Sakshi
Sakshi News home page

ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం

May 18 2026 5:18 PM | Updated on May 18 2026 5:56 PM

Telugu Association of London TAL Premier League 2026 Edition

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (TAL) 2026 వేసవి క్రీడా సీజన్‌ను అధికారికంగా ప్రారంభించింది. లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఈలింగ్ హాన్‌వెలియన్స్ క్రికెట్ మైదానంలో జరిగిన TAL ప్రీమియర్ లీగ్ (TPL) 2026 17వ ఎడిషన్ ప్రారంభోత్సవాన్ని మే 16న ఘనంగా నిర్వహించింది.

క్రికెట్, సమాజ స్పూర్తితో 
కాగా 2009లో TAL క్రికెట్ లీగ్‌గా ప్రారంభమైన ఈ టోర్నమెంట్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ క్రీడా వేడుకలలో ఒకటిగా ఎదిగింది. ప్రతి వేసవిలో ఆటగాళ్లు, కుటుంబాలు, అభిమానులను క్రికెట్, సమాజ స్పూర్తితో ఒక్కచోట చేర్చుతోంది.

 ఆటగాళ్లకు శుభాకాంక్షలు
ఈ ఏడాది టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. రాబోయే 15 వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్ నిర్వహించబడతాయి. చివరగా 2026 ఆగస్టు 16న స్లౌ క్రికెట్ క్లబ్‌లో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులను ఉద్దేశించి TAL ఛైర్మన్ రవి సబ్బా అన్ని జట్లకు, ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ప్రజలను ఒక్కటిగా చేర్చే సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాల నిర్వహణ ద్వారా TAL ఎప్పటికీ తెలుగు సమాజానికి కేంద్రబిందువుగా నిలిచిందని రవి సబ్బా పేర్కొన్నారు. కుటుంబాలు, స్నేహితులు కలుసుకునే అవకాశాలను సృష్టించడం TAL ముఖ్య లక్ష్యమని తెలిపారు.

100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కృషి చేసిన ట్రస్టీ సత్య పెద్ది రెడ్డి మరియు స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ సింధూర చెరుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని వాలంటీర్లకు ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రస్టీ బోర్డు సభ్యులు సత్య పెద్ది రెడ్డి, అశోక్ మధిశెట్టి, వెంకట్ నీలా, రవి మొచెర్ల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట గార్ల సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడా కార్యక్రమాలతో పాటు, TAL “100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్” పేరుతో ప్రత్యేక కమ్యూనిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనేవారు తమ ఆరోగ్యం , ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటూనే, తెలుగు సేవా సంస్థలు మరియు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నిధులు సమీకరించడానికి సహకరిస్తారు.

ఈ కార్యక్రమాన్ని వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగే, సునీత అరిగే మరియు సింధూర చెరుకు సమన్వయం చేస్తూ, మరింత మంది సమాజ సభ్యులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement