
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.
పేరు సరిగ్గా సరిపోయిందంటూ
ఇక ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.
మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా
అదే విధంగా.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో మిలిటరీ బ్రీఫింగ్‌కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.
ఈ ఒక్క ఫొటో చాలు
వాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్‌లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.

మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు.
ఏకత్వంలో నిర్భీతి
ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో
స్పందించారు.
‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.
బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.
చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు