ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న (మే 17) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (56) చేసిన అతడు.. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును (533) దాటాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎడిషన్లలో 500 ప్లస్ పరుగుల ఫీట్‌ను రెండు సార్లు నమోదు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలిసారి 2018 ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును తాకిన రాహుల్.. ఆతర్వాత వరుసగా 2019 (593), 2020 (670), 2021 (626), 2022 (616) ఎడిషన్లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
మధ్యలో 2023 ఎడిషన్‌లో గ్యాప్ ఇచ్చి తిరిగి 2024 (520), 2025 (539), 2026 (533) ఎడిషన్లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఫీట్ ఎవరూ నమోదు చేయలేదు. 19 ఎడిషన్ల చరిత్రలో రాహుల్ తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రాహుల్ ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ మార్కును తాకి విరాట్ కోహ్లి (9) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఇదే మ్యాచ్‌లో రాహుల్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్లో తన 50వ ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌ను నమోదు చేశాడు. తద్వారా విరాట్ కోహ్లి (76), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53), రోహిత్ శర్మ (51) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్.. ఇప్పటికే ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి, ఆరెంజ్ క్యాప్ కోసం ప్రధాన పోటీదారుగా నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్.. అభిషేక్ పోరెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఢిల్లీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.


