మరో టీ20 టోర్నీని ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ | BCCI plans to replace U23 one day competition with T20 tournament | Sakshi
Sakshi News home page

మరో టీ20 టోర్నీని ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ

May 18 2026 9:08 AM | Updated on May 18 2026 9:17 AM

BCCI plans to replace U23 one day competition with T20 tournament

భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలకంగా భావించే అండర్‌-23 టోర్నీలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న అండర్‌-23 పురుషుల వన్డే టోర్నీని ఇకపై టీ20 ఫార్మాట్‌గా మార్చాలని భారత క్రికెట్‌ బోర్డు యోచిస్తోంది.

యువ ఆటగాళ్లలో టీ20 నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆధునిక క్రికెట్‌ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు, ఈ మార్పు వచ్చే దేశీయ సీజన్‌ నుంచే అమల్లోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని తెలుస్తుంది.

ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే అండర్‌-23 పురుషుల వన్డే టోర్నీ "స్టేట్‌ ఏ ఛాంపియన్‌షిప్‌" పేరిట జరుగుతోంది. ఇతర దేశీయ టోర్నీల మాదిరిగానే ఇందులో కూడా ఎలైట్‌, ప్లేట్‌ విభాగాలు ఉన్నాయి. 2025 సీజన్‌లో ఎలైట్‌ విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది.

ఇక ప్లేట్‌ విభాగంలో మేఘాలయా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మహారాజా యాదవీంద్ర సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో మిజోరంను ఓడించి ట్రోఫీని అందుకుంది.

అండర్‌-23 స్థాయిలో రెడ్‌బాల్‌ క్రికెట్‌కు సంబంధించిన మల్టీ డే టోర్నీ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో కొనసాగుతోంది. ఈ ఏడాది ఎలైట్‌ విభాగంలో తమిళనాడు మరోసారి విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దిండిగల్‌లో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement