సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది సమాచారం.
కాగా, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పని తీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చద్దాకు కేబినెట్ పదవి దక్కే అవకాశముంది. అలాగే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓం బిర్లా స్థానంలో ఓ మహిళకు లోక్‌సభ స్పీకర్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇక, తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్‌కు మంత్రివర్గంలో ఛాన్స్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరిని తప్పిస్తారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి.


