శ్రీకాకుళం జిల్లా: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలో విషాదం నింపింది. ఇచ్ఛాపురం మండలం ఒడిశా సరిహద్దు గ్రామమైన మాదుబందకు చెందిన ఎ.రామయ్య (26) పొట్టకూటి కోసం రష్యాకు వలస వెళ్లాడు. రష్యన్ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా.. సోమవారం వేకువజామున 4.40 నిమిషాల సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్ దాడిలో రామయ్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటికే రామయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు గౌరమ్మ, నిమ్మయ్యతో పాటు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గంజాం జిల్లా మేజిస్ట్రేట్ వి.కీర్తి బాసన్ మంగళవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


