కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు | Supreme Court Dismisses Caste Census PIL May 2026 News | Sakshi
Sakshi News home page

కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

May 20 2026 11:39 AM | Updated on May 20 2026 1:29 PM

Supreme Court Dismisses Caste Census PIL May 2026 News

సాక్షి, న్యూఢిల్లీ: కులగణనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇది ప్రభుత్వ విధానపరమై నిర్ణయయమని చెబుతూ.. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం కొట్టేసింది. అదే సమయంలో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

వెనుకబాటుతనం గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది విధానపరమైన నిర్ణయం (పాలసీ డెసిషన్‌). కాబట్టి ఇందులో మా జోక్యం ఉండబోదు. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంఖ్య తెలుసుకోవడం అవసరం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిందే అని చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

జనగణనలో కులగణన వద్దని కోరుతూ సుధాకర్‌ గుమ్ములా సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ వాదనలు ఇలా.. ‘‘కులగణన డేటాను రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమాజంలో విభజన పెరుగుతుంది. కుల ఆధారిత రాజకీయాలు మరింత బలపడతాయి. జనగణన ఉద్దేశం.. ప్రధానంగా జనాభా, ఆర్థిక, సామాజిక వివరాల కోసం మాత్రమే. అలాంటప్పుడు కులగణన చేర్చడం అవసరం లేదు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది. కులాల వారీగా లెక్కలు తీస్తే సమానత్వ భావన దెబ్బతింటుంది’’ అని వాదించారు.

ఈ పిటిషన్‌పై కేంద్రం వాదిస్తూ.. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే కులాల వారీగా డేటా అవసరం. 1931 తర్వాత పూర్తి స్థాయి కులగణన జరగలేదు. కాబట్టి కొత్త డేటా కావాల్సిందే. సమగ్ర అభివృద్ధి కోసం వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవాలి. అసలు కులగణన చేయాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇది న్యాయస్థానం జోక్యం చేసుకునే విషయం కాదు.

సుప్రీం కోర్టు తీర్పు.. జనగణనలో కులగణన ఉండాలా లేదా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. మేము జోక్యం చేసుకోలేం

కులగణన అంటే.. 
జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కించడం. చివరిసారి పూర్తి స్థాయి కులగణన 1931లో జరిగింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే అధికారికంగా లెక్కించబడుతున్నాయి. అయితే కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల సంఖ్య, స్థితి తెలుసుకోవచ్చు. ఇది సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడానికి కీలకమని ప్రభుత్వం చెబుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement