ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి! | Relief from respiratory problems with halotherapy | Sakshi
Sakshi News home page

ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి!

May 21 2026 5:05 AM | Updated on May 21 2026 5:05 AM

Relief from respiratory problems with halotherapy

శ్వాసకోశ సమస్యలకు హాలోథెరపీతో ఉపశమనం లభిస్తుందంటున్న వైద్య నిపుణులు 

దేశంలో సుమారు 10 కోట్ల మందిలో శ్వాసకోస సమస్యలు 

నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యమే కారణం 

గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (జీబీడీ) అధ్యయనం ప్రకారం ప్రపంచంలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు. ముఖ్యంగా మన నగరాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రజలు క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ), ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి ఉప్పుతో చేసే హాలోథెరపీ తేలికపాటి చికిత్స ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఉప్పు గాలి చేసే మంచి.. 
ఉప్పు గదిలో కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవడమే సాల్ట్‌ రూమ్‌ హాలోథెరపీ లేదా సాల్ట్‌ థెరపీ. ఉప్పు గాలి శ్వాసనాళాన్ని శుభ్రపరిచి బలహీనంగా ఉన్న ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ థెరపీతో శ్వాసకోశ సమస్యలు నయంకావడంతోపాటు నిద్ర కూడా సరిగా పడుతుందని అధ్యయనంలో తేలింది.

 ఔషధాల తయారీలో ఉపయోగించే సోడియం క్లోరైడ్‌ను హాలో జనరేటర్‌ అనే యంత్రం సాయంతో చిన్నచిన్న రేణువులుగా మారుస్తారు. ఆ కణాలు గాలిలో తేలుతూ గది అంతటా ఆవరిస్తాయి. ఉప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మ్యూకోలైటిక్‌ (కఫాన్ని పలచబరిచే) గుణాలు సహజంగా ఉంటాయి. ఆ గాలిని పీల్చడం వల్ల ఉప్పు కణాలు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని పలచగా చేసి శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ నిపుణులు అంటున్నారు. 

గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌ అధ్యయన సంస్థ ప్రపంచంలో 160కిపైగా దేశాల్లో సేవలందిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో బిల్‌ గేట్స్, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ నిధులతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. దాదాపు 12 వేల మంది పరిశోధకులు ఈ అధ్యయనాల్లో పాల్గొంటున్నారు.     – సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement