ఉంటారో, చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి  | Indian Army Chief Upendra Dwivedi Serious Warning To Pakistan | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ మ్యాప్‌లో ఉండరు.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్‌

May 16 2026 1:26 PM | Updated on May 17 2026 2:52 AM

Indian Army Chief Upendra Dwivedi Serious Warning To Pakistan

పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక

న్యూఢిల్లీ: పహల్గాం పచ్చికమైదానంలో పాశవిక దాడి మొదలు తరచూ సరిహద్దు వెంట ఉగ్ర చొరబాట్లకు పాల్పడుతున్న దాయాది పాకిస్తాన్‌ను భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం ఢిల్లీలోని మాణిక్‌షా సెంటర్‌లో యూనిఫాం అన్‌వీల్డ్‌ సంస్థ చేపట్టిన ‘సేనా సంవాద్‌’కార్యక్రమంలో పాక్‌నుద్దేశించి ద్వివేది వ్యాఖ్యలుచేశారు.

 ‘‘తీరు మార్చుకోకుండా ఇలాగే ముష్కర మిన్నాగులకు పాలు పోసి పెంచినా, ఉగ్ర చొరబాట్లను ప్రోత్సహించినా మీ అంతుచూస్తాం. భౌగోళిక పటంలో ఉండాలనుకుంటున్నారో, సర్వనాశనమై చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోతే మీ పుట్టి ముంచేస్తాం. మిమ్మల్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తాం’’అని హెచ్చరించారు. 

అలాంటి కేఫ్‌.. నా కల 
ఆర్మీ చీఫ్‌ యువతతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. ‘‘ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ అయ్యాక నచ్చిన పనిచేస్తా. ముఖ్యంగా నా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో దైనందిన జీవితంలో అలసిపోయిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కేఫ్‌ను ఆరంభిస్తా. జీవితాన్ని నెమ్మదిగా సాగిపోనీ అనే అర్థం వచ్చేలా కేఫ్‌కు ‘ఆహిస్తా జిందగీ’అని పేరు పెడతా. ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు ఎవరికీ కాసింత ఖాళీ సమయం దొరకట్లేదు. 

ఒక్కచోట కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక మంచి ఆలోచన చేసే తీరికే లేదు. కేఫ్‌లో అయితే జనం కొద్దిసేపు కూర్చుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు కెరీర్, ఇతర అంశాల్లో ఉచితంగా సలహాలు, సూచనలు చేసే ఏర్పాట్లుచేస్తా. అందులో ఒక గ్రంథాలయం సైతం అందుబాటులోకి తెస్తా. ఆలోచనల కూడలిగా ఆ కేఫ్‌ నిలిచిపోవాలి’’అని అన్నారు. 
 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement