ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచినప్పటికీ ఇంధన కంపెనీలు రోజూ వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ పేర్కొన్నారు. ధరల పెంపుకు ముందు ఆ నష్టం రోజుకు సూమారు రూ. 1,600 కోట్ల వరకు ఉండేదని తెలిపారు.
హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమరు విషయమై తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో క్రూడాయిల్ బ్యారెళ్ ధర పెరగడంతో కేంద్రప్రభుత్వం సైతం పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా దీనిపై పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియా సమావేశం నిర్వహించారు.
సుజాత శర్మ మాట్లాడుతూ.. ఇటీవల పెంచిన ఇంధన ధరలు చమురు కంపెనీల నష్టాలను కొంతవరకు తగ్గించగలిగాయి కానీ పూర్తి స్థాయిలో కాదు. లీటరుకు దాదాపు రూ.3 పెంచిన తర్వాత ఇప్పుడు రోజుకు రూ. 750 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. కంపెనీల అండర్- రికవరీలు (ఆదాయ లోటు) ,ఆర్థిక నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి... అయినప్పటికీ ఈ దశలో చమురు కంపెనీలకు ఎటువంటి బెయిలవుట్ ప్యాకేజీని (ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని) అందించే విషయం పరిశీలించడం లేదు అని ఆమె అన్నారు.
అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం కాక ముందు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) నివేదిక ప్రకారం భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర బ్యారెల్‌కు 69.01 డాలర్లుగా ఉండగా... మే 15 నాటికి ఈ ధర బ్యారెల్‌కు 110.73 డాలర్లకు చేరుకుందన్నారు. అంటే యుద్ధ కాలంలో ఏకంగా 60.45 శాతం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగి ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు.


