సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
నిర్మాతగా..
అవ్నీ మూవీస్ అధినేత కుష్బూ సుందర్, బెంజ్ మీడియా అధినేత సీసీఎస్ అరుణ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న డబుల్ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథ్, వీనోద్ కిషన్, వీటీవీ.గణేశ్, భగవత పేరుమాళ్, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
రెండు సినిమాలు..
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్ ఫుల్ ఎంటర్‌టెయినర్‌గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్‌కుమార్ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్.. మీసయ్య మురుక్కు సీక్వెల్ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది.


